కొణిజర్ల: ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మండలంలోని తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన బుధవారం జాబ్‌మేళా నిర్వహించగా.. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలోపేతంగా లేకపోవడమే వివక్షకు కారణమని గుర్తించిన ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఆడపిల్ల పుట్టడం అదృష్టమని చాటేందుకు జిల్లాలో ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కాగా, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదివే బాలికలు బాధ్యతగా వ్యవహరించాలని, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కాగా, తాను ఈ స్థాయికి చేరడానికి అమ్మమ్మ కారణం కాగా.. తన భార్య కూడా ఢిల్లీలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయాన మహిళా అధికారులకు విధులు అప్పగిస్తే రూ.4 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం జప్తు చేశారని గుర్తు చేశారు. తొలుత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురుకుల నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రిన్సిపాల్‌తో చర్చించడమే కాక జాబ్‌మేళాకు వచ్చిన కంపెనీలు, ఉపాధి అవకాశాలపై ఆరా తీశారు. కాగా, జాబ్‌మేళాలో 15 కంపెనీల బాధ్యులు ఇంటర్వ్యూలు నిర్వహించగా 431 మంది ఎంపికయ్యారు. జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి, ప్రిన్సిపాల్ డాక్టర్ రజిత, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, వివిధ కంపెనీల ప్రతినిధులు, కోఆర్డినేటర్లు ఐశ్వర్య, రాణి, కె.రజిని, రాజేశ్వరి పాల్గొన్నారు.
మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి..
ఖమ్మంమయూరిసెంటర్: సాధారణ మాల్స్ మాదిరి కాకుండా మహిళా మార్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్‌లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు. అలాగే, జిల్లా ఖ్యాతిని చాటేలా లోగో రూపొందించాలని చెప్పారు. డీఆర్‌డీఓ సన్యాసయ్య, అడిషనల్ డీఆర్‌డీఓ నూరుద్దీన్, పీఆర్ ఈఈ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌పై దృష్టి
ఖమ్మంగాంధీచౌక్: వివిధ మండలాల్లో పైలట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మొదలయ్యేలా దృష్టి సారించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, డీఆర్‌ఓ పద్మశ్రీ, జెడ్పీసీఈఓ దీక్షరైనా, డీఆర్‌డీఓ సన్యాసయ్య, హౌసింగ్, పీఆర్ ఈఈలు బి.శ్రీనివాస్, వెంకటరెడ్డి, డీపీఓ ఆశాలతతో కలిసి పలు అంశాలపై సమీక్షించారు. పైలట్ గ్రామాల్లో 850 ఇళ్లు మంజూరు చేయగా.. పెట్టుబడి లేని వారి కుటుంబాల్లో మహిళలు స్వయం సహాయక సభ్యులుగా ఉండడంతో 369 మందికి రుణం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారికి త్వరగా రుణం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చూడాలని చెప్పారు. అలాగే, మోడల్ ఇళ్ల నిర్మాణం ఆరు చోట్ల పురోగతిలో లేనందున రెండు వారాల గడువు ఇవ్వాలని, అయినా పని కాకపోతే కాంట్రాక్టర్‌ను మార్చాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా
బలోపేతం కావడమే కీలకం
ఆడపిల్ల గర్వకారణమని చెప్పడానికే ప్రత్యేక కార్యక్రమం
తనికెళ్ల మహిళా డిగ్రీ కళాశాల
జాబ్‌మేళాలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్