● అడ్డగోలుగా బహుళ అంతస్తుల నిర్మాణాలు ● శిథిలావస్థ భవనాల తొలగింపుపై మీనమేషాలు ● ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి ● ఆ తర్వాత పట్టించుకోని అధికార యంత్రాంగం
ఖమ్మంమయూరిసెంటర్: నిబంధనలు పాటించని బహుళ అంతస్తుల నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగరంతోపాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా భవనాలను నిర్మిస్తున్నారు. అంతేకాక ఎప్పుడు కూలుతాయో తెలియని భవనాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నా.. వీటిపై చర్యలు మాత్రం ఉండడం లేదు. జరగరాని ఘోరం జరిగినప్పుడు మాత్రం అధికార యంత్రాంగం స్పందించి నోటీసులు ఇవ్వడం, ఎక్కడెక్కడ ఇటువంటి భవనాలు ఉన్నాయో లెక్కలు తీస్తున్నాయి. ఆ తర్వాత పరిస్థితి యథావిధిగానే ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడంతో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలపై చర్చ మొదలైంది.
అడ్డగోలుగా నిర్మాణాలు..
జిల్లాలో ప్రధానంగా ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఖమ్మం నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న ఖమ్మంరూరల్ మండలంలో కూడా బహుళ అంతస్తుల నిర్మాణాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అయితే ఆయా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా..? లేవా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుంటున్న యజమానులు నాలుగు నుంచి ఐదు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక బిల్డర్లు ఏ మేరకు నాణ్యత పాటిస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లాభాల కోసం భవనాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో జీ ప్లస్ 1కు అనుమతి తీసుకుని.. 5 అంతస్తులకు స్లాబ్ వేశారు. దీనికి ఎలాంటి సెట్‌బ్యాక్ కూడా లేదు. అధికారుల పరిశీలనలో ఈ భవనాన్ని గుర్తించి పెనాల్టీ విధించడంతో పాటు పైన రెండు అంతస్తులను నిర్మించకుండా అడ్డుకున్నారు. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.
106 భవనాలకు నోటీసులు..
2020లో అధికారులు నగరంలో 106 శిథిలావస్థ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలున్నాయి. నాటి నుంచి ఇప్పటి వరకు 102 భవనాలను తొలగించినట్లు అధికారులు లెక్కలు చూపిస్తుండగా.. మరో నాలుగు భవనాలు అలాగే ఉన్నాయి. పూర్తిగా శిథిలమైన భవనాలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. నగరంలోని శుక్రవారపేట, నిజాంపేట, త్రీటౌన్ ప్రాంతం, మామిళ్లగూడెం ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు ఇంకా ఉంటాయని, వీటిని అధికారులు గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. ఆయా ప్రాంతాలతో పాటు నగరంలో అనేక చోట్ల పాత భవనాలపై కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. పాత భవనాల పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకోకుండా అధికారులు వాటిపై మరో నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారులు కూడా అనుమతులు ఇచ్చేటప్పుడు స్థలాలను పరిశీలించడం లేదని, ఉన్న భవనాల పరిస్థితిని కూడా అంచనాలు వేయడం లేదని విమర్శలు చేస్తున్నారు.
నగరంలోని నిజాంపేట ప్రాంతంలో ఎండోమెంట్‌కు సంబంధించిన ఓ భవనం శిథిలావస్థకు చేరింది. దీనిని తొలగించాలని 2020లో అధికారులు నోటీసులు జారీ చేశారు. పలుమార్లు భవనంను తొలగించేందుకు కేఎంసీ అధికారులు అక్కడికి వెళ్లినా పలు కారణాలతో భవనాన్ని తొలగించకుండా వెనుదిరిగారు. ఎండోమెంట్ అధికారులు కూడా తొలగింపునకు పలు కారణాలు చూపి అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఎదురుగానే స్థానికులు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. చిన్నపిల్లలు కూడా చుట్టుపక్కల ఆటలు ఆడుతూ ఉంటారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.