ఖమ్మంసహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో ‘ఓపెన్’పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యాన ఏప్రిల్ 20 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహిస్తుండగా.. జిల్లాలో 655 మంది పదో తరగతి అభ్యర్థులకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు, 898 మంది ఇంటర్ అభ్యర్థులకు మరో నాలుగు పరీక్షా కేంద్రాలను నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు ఎనిమిది సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. సెల్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలు పోస్టల్ శాఖ ద్వారా డీఆర్‌డీసీ సెంటర్‌కు పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, ఓపెన్ స్కూల్ జిల్లా కన్వీనర్ పాపారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.