ఖమ్మంవన్‌టౌన్: డోర్నకల్–మిర్యాలగూడ, డోర్నకల్–గద్వాల రైల్వేలైన్ల అలైన్‌మెంట్ మార్చాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రఘురాంరెడ్డి కోరారు. ఈసందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్‌ను కలిశారు. ప్రతిపాదిత అలైన్‌మెంట్ జరిగే నష్టం, చేయాల్సిన మార్పులను వివరించారు. ఈ అంశాలపై బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించి, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారని ఎంపీ ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘యువ వికాసం’కు 5లోగా దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: రాజీవ్ యువవికాసం పథకానికి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువత వచ్చేనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల్లోని నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలతో ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఈమేరకు ఆసక్తి ఉన్న ఎస్సీ నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని దరఖాస్తు ప్రతికి అవసరమైన పత్రాలు జతపరిచి గ్రామీణ ప్రాంతాల వారైతే మండల ప్రజాపాలన సేవా కేంద్రాల్లో, పట్టణ ప్రాంతాల అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
మైనార్టీ అభ్యర్థులు...
ఖమ్మంమయూరిసెంటర్: రాజీవ్ యువ వికాసం పథకం కోసం ముస్లిం, క్రైస్తవ, సిక్, బౌద్ధులు, జైనులు, పార్సీలకు చెందిన మైనారిటీ నిరుద్యోగ యువత వచ్చేనెల 5లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్ బి.పురంధర్ ఒక ప్రకటనలో సూచించారు. పూర్తి వివరాల కోసం 97040 03002లో సంప్రదించాలని తెలిపారు.
31లోగా జీఎస్టీ చెల్లిస్తే జరిమానా, వడ్డీ మాఫీ
2017 నుంచి 2020 వరకు
బకాయిలకు వర్తింపు
ఖమ్మంగాంధీచౌక్: జీఎస్టీ(వస్తు సేవా పన్ను) ప్రారంభమైన తొలి మూడేళ్లకు సంబంధించి విధించిన జరిమానా, వడ్డీ రాయితీకి మినహాయింపు ఇస్తూ సంస్థ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ ఏర్పాటైన తొలి మూడేళ్లలో సాంకేతిక కారణాలతో పన్నుల్లో వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. దీన్ని సవరించాలని చెల్లింపుదారులు విజ్ఞప్తి చేయగా జరిమానా, వడ్డీ మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2017 నుంచి 2020 వరకు నిర్దేశిత పన్నులను ఈనెల 31లోగా చెల్లిస్తే జరిమానా, వడ్డీ మాఫీ చేస్తామని, అప్పీలేట్ అథారిటి లేదా కోర్టును ఆశ్రయించిన వారికి సైతం ఈ ఉత్తర్వులు వర్తిసాయంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవకాశాన్ని చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాష్, స్టేట్ జీఎస్టీ కమిషనర్ హరిత ఓ ప్రకటనలో సూచించారు.
మాడ వీధుల విస్తరణకు లైన్ క్లియర్
నిర్వాసితులకు చెక్కుల పంపిణీ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి మార్గం సుగమమైంది. విస్తరణ పనులకు అధికారులు రెండెకరాల స్థలం సేకరించారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి తొలి విడతగా రూ. 60 కోట్లను ప్రకటించి, రూ. 35 కోట్లు విడుదల చేశారు. దీంతో భూ, ఇళ్ల నిర్వాసితులకు శుక్రవారం నష్టపరిహారం అందజేశారు. ఆర్డీఓ దామోదర్‌రావు తన కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. 17 కుటుంబాలకు రూ. 10.82 కోట్లను అందించారు. మిగతావారికి శనివారం చెక్కులు ఇస్తామని, మొత్తంగా 40 కుటుంబాలకు రూ.34.45 కోట్లు అందజేయాల్సి ఉందని వెల్లడించారు. కాగా ఏప్రిల్ 6న ఆలయ అభివృద్ధి, మాడ వీధుల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
రైల్వేలైన్ల అలైన్‌మెంట్ మార్చండి
రైల్వేలైన్ల అలైన్‌మెంట్ మార్చండి