● రిటైర్డ్ అయిన, కానున్న ఉద్యోగులతో కలెక్టర్ ముఖాముఖి ● ప్రస్తుత ఉద్యోగులకు సూచనలు ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమం
ఖమ్మం సహకారనగర్: నిత్యం అధికారులు, సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలతో ఖమ్మం కలెక్టరేట్ సందడిగా ఉంటుంది. కానీ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం వివిధ శాఖల ఉద్యోగులంతా చేరారు. ప్రతీనెలా మాదిరిగానే ఈనెల 31న ఉద్యోగ విరమణ చేయనున్న ఉద్యోగులు, వారి కుటుంబాలతో సహా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సన్మానిస్తారనే సమాచారం ఇవ్వగా వారంతా వచ్చారు. కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి వినూత్నంగా ‘ప్రస్థానం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన కలెక్టర్.. రిటైర్డ్ ఉద్యోగులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి ఉద్యోగ ప్రస్థానం, ఎక్కడెక్కడ పనిచేశారు.. విధినిర్వహణలో ఎదురైన అంశాలను ఆరాతీస్తూ ప్రస్తుత ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈమేరకు సమావేశ మందిరంలో ఉద్యోగిని కూర్చోబెట్టి ఎదురుగా కలెక్టర్ కూర్చుని ఇంటర్వ్యూ మాదిరి కొనసాగించారు. తొలుత గత నెలలో రిటైర్ అయి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌పై విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మ ణ్‌రావుతో ఆయన మాట్లాడారు. ఉద్యోగంలో చేరిన సమయాన పరిస్థితులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఉమ్మడి జిల్లాగా భద్రాచలం వరదల సమయాన ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆరా తీస్తూ వారి అనుభవాలు, నాడు – నేడు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు.
రిటైర్‌కానున్నది వీరే..
ఈనెల 31న జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు ఆరుగురు రిటైర్ కానున్నారు. ఇందులో ఎం.మల్లికార్జునరావు(ఫార్మసిస్ట్, కొణిజర్ల), డి.బాలాజీ (సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్), ఎం. బాలహేమలత(ఆర్‌అండ్‌బీ ఈఈ), పి.రామకృష్ణ(తిరుమలాయపాలెం తహసీల్దార్), ఎన్.సత్యవతి (డీఆర్‌డీఓ ఈఓ), సీహెచ్.రాధ(ఖమ్మం ఎస్సీ బాలికల హాస్టల్ కుక్) ఉన్నారు. వీరిని కుటుంబీకులతో సహా కలెక్టర్ సన్మానించారు. అలాగే, ఉద్యోగం రాక ముందు ఏం చేశారు, ఉద్యోగం ఎలా వచ్చింది.. ఎక్కడెక్క పనిచేశారు.. ఆ సమయంలో ఘనతలను తెలుసుకున్న ఆయన ప్రస్తుత ఉద్యోగులకు అవసరమైన సూచనలు ఇవ్వాలని సూచించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, కలెక్టరేట్ ఏఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.
మీ ‘ప్రస్థానం’ వివరించండి...