ముహూర్తం ఖరారు | - | Sakshi
Sakshi News home page

ముహూర్తం ఖరారు

Mar 29 2025 12:24 AM | Updated on Mar 29 2025 12:22 AM

● రేపు కల్లూరుగూడెంలో పామాయిల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన ● హాజరుకానున్న మంత్రి తుమ్మల ● ఉమ్మడి జిల్లాలో మూడో ఫ్యాక్టరీతో రైతులకు మేలు

వేంసూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడో పామాయిల్‌ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. వేంసూరు మండలం కల్లూరుగూడెంలో గత ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీ కోసం 42ఎకరాల స్థలం సేకరించగా.. ఆయిల్‌ ఫెడ్‌ ఆధ్వర్యాన మూడేళ్ల క్రితం ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటుచేశారు. కానీ రకరకాల కారణాలతో ఫ్యాక్టరీ ఏర్పాటులో జాప్యం జరిగింది. ఆపై కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల బాధ్యతలు స్వీకరించడంతో ప్రత్యేక దృష్టి సారించారు. ఈనేపథ్యాన ఉగాది సందర్భంగా ఆదివారం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయనతో పాటు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి చేతుల మీదుగా శంకుస్థాపనకు నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ముహూర్తాన్ని నిర్ణయించారు.

రూ.70కోట్ల వ్యయంతో...

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రెండు పామాయిల్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అశ్వారావుపేటలోని ఫ్యాక్టరీ 30 టన్నులు, అప్పారావుపేటలో 90 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో కొనసాగుతున్నాయి. అయితే, ఉమ్మడి జిల్లాలో ఏటేటా ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం పెరుగుతుండడం.. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇది ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో ఇంకో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం వేంసూరు మండలం కల్లూరుగూడెంలో మూడేళ్ల క్రితం 42 ఎకరాల భూమి సేకరించగా.. అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈమేరకు రూ.70 కోట్లు వెచ్చించనుండగా, ఇందులో రూ.52కోట్లు యంత్రాలకు, రూ.18 కోట్లు నిర్మాణాలకు కేటాయిస్తారు. ఈ ఫ్యాక్టరీలో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు ఏర్పాటుచేస్తారని.. తద్వారా గంటకు 15 టన్నుల గెలలను క్రషింగ్‌ చేయొచ్చని చెబుతున్నారు.

వేగంగా రోడ్డు నిర్మాణ పనులు

కల్లురుగూడెం ప్రధాన రహదారి నుంచి ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలం వరకు వరకు 60 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఐదుగురు రైతుల నుంచి 6.10 ఎకరాల భూమిని సేకరించిరూ.33లక్షల చొప్పున పరిహారం చెల్లించారు.

పెరిగిన ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం

వేంసూరు మండలంలో గతంలో దాదాపు 25వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండేవి. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ఇతర కారణాలతో రైతులు మామిడి సాగుపై ఆసక్తి కోల్పోతున్నారు. ఇదే సమయాన ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించగా.. ప్రస్తుతం మండలంలో 6,550 ఎకరాల్లో 1,619 మంది రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారు. ఇక జిల్లాలో ఈ పంట సాగు వ్యాప్తంగా 35వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగువుతోంది.

జిల్లాలో వెయ్యికి పైగా ఎకరాల్లో

ఆయిల్‌ పామ్‌ సాగవుతున్న మండలాలు

మండలం సాగు విస్తీర్ణం

(ఎకరాల్లో)

సత్తుపల్లి 10,087.21

వేంసూరు 6,550

పెనుబల్లి 3,178.96

కొణిజర్ల 2,246.35

ఏన్కురు 1,995.13

తిరుమలాయపాలెం 1,850.68

ఎర్రుపాలెం 1,550.23

కల్లూరు 1,351.42

ఖమ్మం రూరల్‌ 1,059.02

మాకొద్దు ఈ పామాయిల్‌ ఫ్యాక్టరీ

కల్లూరుగూడెంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మించవద్దని పలువురు స్థానికులు శుక్రవారం సమావేశమై చేశారు. సామూహిక పట్టా భూమి 42 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శకి వినతిపత్రం అందించారు. ఇప్పటికే సివిల్‌ సప్లయీస్‌ గోదాంకు ఏడెకరాల భూమి ఇస్తే పురుగులతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. ఇప్పుడు సామూహిక పట్టా స్థలంలో ఫ్యాక్టరీ నిర్మిస్తే కాలుష్యం పెరగడమే కాక గ్రామ అవసరాలకు సెంటు భూమి కూడా ఉండదని తెలిపారు. ఈ విషయమై 2022లో హైకోర్టును ఆశ్రయించగా విచారణలో ఉందని, మానవ హక్కుల సంఘాన్ని సైతం ఆశ్రయించామని వెల్లడించారు.

అపోహలు నమ్మొద్దు

ఫ్యాక్టరీ నిర్మాణంతో కల్లూరుగూడెంలో కాలుష్యంగా పెరుగుతుందనే అపోహలను గ్రామస్తులు నమ్మవద్దని కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ ఓ ప్రకటనలో సూచించారు. మలేషియా, థాయిలాంగ్‌ ఇండోనేషియా తదితర దేశాల్లో అధ్యయనం చేశాక కాలుష్య రహితమైన అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే అదనపు నీటిని సైతం ఫిల్టర్‌ చేశాకే బయటకు వదులుతారని పేర్కొన్నారు. కాగా, ఫ్యాక్టరీ నిర్మాణంతో గ్రామంలోని 250మందికి ఉపాధి లభిస్తుందని, మండల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement