కొణిజర్ల: సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు సాగర్ కెనాల్‌లో మునిగి కన్నుమూశాడు. కొణిజర్ల ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు... మండలంలోని తనికెళ్లకు చెందిన బత్తుల కనకారావు కుమారుడు సాయి(15) స్థాఽనిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఒక పూట బడికి వెళ్లొచ్చిన ఆయన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన బోనకల్ బ్రాంచి కెనాల్‌లో ఈతకు వెళ్లాడు. అయితే, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోగా, ఆయన స్నేహితులు వచ్చి కాలనీ వాసులకు తెలిపారు. దీంతో పోలీసులు, గజ ఈతగాళ్లు కాల్వలో గాలించగా సాయి మృతదేహం లభ్యమైంది. అయితే, సాయి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు చేయగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదం