
తీపి.. చేదు సమ్మిళితం !
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ఇచ్చి హామీ మేరకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అయితే, ఈ పథకాలతో జిల్లాలో లబ్ధి పొందిన వారు ఆనందంగా ఉండగా... దరఖాస్తు చేసుకున్నా పథకాలు అందని వారు నిరీక్షిస్తున్నారు. రైతుభరోసా, రుణమాఫీ, రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు పొందిన వారంతా విశ్వావసు నామ సంవత్సరంలోకి ఆనందంగా అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మిగతా వారు మాత్రం ఉగాది పండుగ రోజు పచ్చడి రుచి మాదిరిగానే పథకాలు అందుతాయన్న ఆశల తీపి.. ఎప్పుడు అందుతాయో తెలియని వగరు రుచి ఎదుర్కోనున్నారు. కానీ ఇది చేదుగా మాత్రం మారొద్దని వారి ఆకాంక్షగా చెబుతున్నారు.
సొంత ఇంటిలో చేరాలని..
ప్రభుత్వం పథకాలకు సంబంధించి నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో 850 మంది లబ్ధిదారులను ప్రకటించగా.. ఇందులో 500 మందికి గ్రౌండింగ్ పూర్తయింది. దీంతో వీరంతా విశ్వావసు నామ సంవత్సరంలో సొంత గూటికి చేరుకుని తీపి వేడుక జరుపుకోనున్నారు. మరో 350 మందికి ఆర్థిక, ఇతర కారణాలతో ఆలస్యం అవుతుండగా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం 3,40,923 మంది దరఖాస్తు చేసుకోగా 60,747 మంది అర్హులను గుర్తించారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా మరో 4,536 మంది అర్హులుగా తేలారు. వీరంతా అద్దె ఇళ్లు, గుడిసెల్లో గడుపుతున్న చేదు జీవనం నుంచి తీపి జ్ఞాపకంగా సొంతింట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు.
రైతులకు కలిసి వచ్చేనా..
జిల్లాలో రైతు భరోసా కింద 3,51,592 మంది అన్నదాతలకు ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.371.06 కోట్లు రావాల్సి ఉంది. ఇప్పటివరకు 2,65,392 మంది రైతుల ఖాతాల్లో రూ.215.78 కోట్లు జమ అయ్యాయి. అందరికీ సోమవారం లోగా అందుతాయని మంత్రి తుమ్మల ప్రకటించినా ఖాతాలో జమ అయితేనే తమకు తీపి కబురు చెప్పినట్లని వారు భావిస్తున్నారు. ఇక జిల్లాలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వరకు 3,73,157 మంది రైతులు బ్యాంకుల ద్వారా రూ.4,307.58 కోట్ల రుణాలు తీసుకున్నారు. మూడు విడతలుగా చేస్తే 1,15,627 మందికి రూ.770.95 కోట్లే మాఫీ అయ్యాయి. దీంతో మిగతా వారి గొంతులో చేదు గుళికలు కరిగిపోవడం లేదు. అంతేకాక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి ధర గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది రూ.14 వేల లోపే ధర వస్తుండడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
రేషన్‌కార్డులు వస్తేనే..
జిల్లాలో రేషన్‌కార్డుల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా కార్డుల జారీ లేకపోవడంతో కొన్ని సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ ఏడాది జనవరి 26న కొత్తగా 484రేషన్‌కార్డులు మంజూరు చేయగా, వీటి ద్వారా 862 మందికి బియ్యం అందుతోంది. అయితే, గ్రామసభల ద్వారా 66,115, మీ సేవ కేంద్రాల ద్వారా అందిన 6,966 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్ 1నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయనుండడంతో దరఖాస్తుదారులంతా తమకు కొత్త సంవత్సరంలో కార్డులు అందాలని ఆశిస్తున్నారు.
అందరికీ సంక్షేమ పథకాలు
అందక అర్హత ఉన్న వారి
ఎదురుచూపులు
ఈ ఏడాది సొంతింటి కల
నెరవేరుతుందని ఆశలు
రుణమాఫీ కాక..
మిర్చి ధర తగ్గడంతో రైతుల్లో నిరాశ
అందరి ఆశలను ‘విశ్వావసు’
తీర్చాలని ఆకాంక్ష
రాజీవ్ యువవికాసం కోసం..
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. యువత సొంత వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణ సాయం అందనుంది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, క్రిస్టియన్, గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగనుండగా, ఇప్పటివరకు బీసీ యువత నుంచి 8,720, ఎస్సీల నుంచి 5,741, మైనార్టీల నుంచి 1,102, క్రిస్టియన్ల నుంచి 19, గిరిజనుల నుంచి 3వేల దరఖాస్తులు అందాయి. వీరి అర్హతల ఆధారంగా సబ్సిడీ రుణం జూన్, జూలైలో మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. తమ జీవితం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలో కొత్త మలుపు తిరగనుందని ఆకాంక్షిస్తున్నారు.

తీపి.. చేదు సమ్మిళితం !

తీపి.. చేదు సమ్మిళితం !

తీపి.. చేదు సమ్మిళితం !

తీపి.. చేదు సమ్మిళితం !