
క్రోధి గతించి.. విశ్వావసు ఏతెంచె..
ఆమని రావాలి..
తెలుగు వారి తెలుగు తీయదనము
ఉగాది పచ్చడి కమ్మదనము
తెలుగు వారి కొత్త సంవత్సరం
సంస్కతి సంప్రదాయాల కొనసాగింపు
పిల్లలు కొత్త బట్టలతో కేరింతలు
బంధువుల రాకతో ఇళ్లన్నీ కొత్త పలకరింపులు
అందరి జీవితాల్లో ఆమని రావాలి
ఇళ్లన్నీ ధాన్యపురాశులతో నిండాలి
పెద్దల పూజలు పంచాగ శ్రవణం
మాలోని మా శత్రువులను జయించుకొని
జగమంతా వసుదైక కుటుంబంలా ఉండాలని
జనుల్లో సంతోషం వెల్లివిరియాలని
ఈ ఉగాది అందరిలో కొత్త కాంతులు నింపాలని
జీవితమంటే చేదు కారం పులుపు తీపి ఒగరులతో కూడినదే
ఈ ఉగాది తేవాలి ఉషస్సులను
ఈ ఉగాది పోగొట్టాలి అందరి తమస్సులను
–వేము రాములు, తెలుగు ఉపాధ్యాయుడు, మహదేవపురం హైస్కూల్
తెలుగు సంవత్సరాది.. ఉగాది తరలివచ్చింది. క్రోధి నామ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోగా.. చైత్ర మాసపు వసంత సొబగులతో విశ్వావసు కదలివచ్చింది. సమస్త జనుల్లో నూతన ఆశలను రేకెత్తిస్తూ ఏతెంచింది. గత కాలపు కష్టనష్టాలు, అవమానాలు, అనుమానాలకు సెలవిచ్చి మధుర స్మృతులను నెమరువేసుకుంటూ కొత్త ఏడాదిలో ఆత్మీయ అనురాగాలతో ప్రశాంత పూల పరిమళాలు వెదజల్లుతూ ముందుకు సాగుదాం. నేడు ఏరువాక సాగే రైతుల లోగిళ్లు సిరి సంపదలతో తులతూగాలని ఆశిద్దాం. పండుగ ప్రాశస్త్యం, షడ్రుచుల విశిష్ఠతను ఆవిష్కరించిన సమసమాజ స్వాప్నికులు.. మన కవుల కృతులను ఆలకిద్దాం. – సాక్షి నెట్‌వర్క్
ఉగాదిజం..
షడృచుల సంవత్సరాది, మన ఉగాది..
కాదది హిందూ మాత్రపు పర్వదినం
సర్వ మానవాళికి మార్గదర్శనం..
భారతీయ సంస్కతిని ప్రతిబింబించే
ఓ జీవన విధానం..
ఉగాది పచ్చడిలా కలిసి బతకమని చాటి చెప్పిన
భారతావని ‘భాయి’చారాలు.
బాహ్యం కాదు ఆత్మ సౌందర్యం చూడమని
సృష్టి చెప్పే ప్రవచనాలు..
కుల మతాలు ఎన్నున్నా, వర్ణ గోత్రాలెన్నున్నా..
ఉగాది పచ్చడిలా అంతా కలిసిపోయి
ఒదిగి పొవాలని..
ఐకమత్య భారతావనై వెలుగొందాలని
చాటుతోంది ఉగాది..
–ఎం.డీ.మొహియుద్దీన్, శ్రీనగర్‌కాలనీ, ఖమ్మం
●

క్రోధి గతించి.. విశ్వావసు ఏతెంచె..

క్రోధి గతించి.. విశ్వావసు ఏతెంచె..