సత్తుపల్లిటౌన్: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని మసీద్‌రోడ్డుకు చెందిన షేక్ అలీబాబా అలియాస్‌బన్ను (24) ఇటీవల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు రాశాడు. ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తండ్రి భాషావలీ అనారోగ్యంతో నాలుగేళ్ల కిందట మృతి చెందాడు. సోదరుడు భాషా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా తల్లి హసీన కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, మృతుడి స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి కావటంతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అక్కడికి తరలించారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థిని...
తిరుమలాయపాలెం: ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థిని చికిత్స అనంతరం కూడా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెంనకు చెందిన బాతుల ఉపేందర్ – ఉమ దంపతుల కుమార్తె ఉదీప (20) ఖమ్మంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఆరు నెలల కిందట కళాశాలలో కింద పడిన ఆమె తలకు బలమైన గాయం కాగా, హైదరాబాద్‌లో చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు.
అయితే, మందులు వాడుతున్నా ఏమి గుర్తురాక ఇబ్బంది పడుతున్న ఆమె మానసికంగా వేదన చెందుతోంది. మూడు రోజుల కిందట తిరుమలాయపాలెంలో ఉండే మావయ్య మండల భిక్షం ఇంటికి వచ్చిన ఉదీప శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.జగదీశ్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్‌ఐ గుగులోత్ సూరజ్ తెలిపిన వివరాలు.. మండలంలోని పల్లిపాడుకు చెందిన కార్పెంటర్ నంచర్ల శివయ్యచారి (58) శనివారం తన ద్విచక్రవాహనంపై పాల కోసం వెళ్తూ పల్లిపాడు సెంటర్‌లో రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి మియాపూర్ వెళ్తున్న రాజధాని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శివయ్య బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు పరబ్రహ్మాచారి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, గతంలో శివయ్యచారి తమ్ముడు కూడా ఇదేవిధంగా ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందాడు.
చిన్నారులపై కుక్క దాడి
నేలకొండపల్లి: మండలంలోని రాయగూడెంలో ఇద్దరు చిన్నారులపై శనివారం కుక్క దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారులు జాహ్నవి, వేదాన్ష ఆడుకుంటుండగా ఓ కుక్క వెంట పడి దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను తరిమివేయగా అప్పటికే చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో నేలకొండపల్లిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.