ఎర్రుపాలెం: తెలంగాణా తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారికి అర్చకులు సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతంతో అభిషేకం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని, శ్రీఅలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారికి వేపపువ్వు ప్రసాదం నివేదించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్కరణి నుంచి ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ తదితరులు మేళతాళాలతో తీర్థపు బిందె తీసుకొచ్చారు. తొలుత విఘ్నేశ్వర పూజ చేసి పుణ్యావాచనం, అనుష్టానాలు, రుత్విక్కరణ తదితర పూజలు చేశారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని అర్చకులు, వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అంతకుముందు శ్రీవారి నిత్య కల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజు, ఉగాదిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అర్చకులు వేపపువ్వు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్తలు ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, కృష్ణమోహన్‌శర్మ, వకుళామాత స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు, ఆలయ సూపరింటెండెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
జమలాపురంలో బ్రహ్మోత్సవాలు షురూ..