
ముస్లింలకు పొంగులేటి శుభాకాంక్షలు
ఖమ్మంవన్‌టౌన్/ఖమ్మం మామిళ్లగూడెం: జిల్లాలోని ముస్లింలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాసం ఉండి పవిత్రంగా జరుపుకునే పండుగ ఈద్ అని పేర్కొన్నారు. సహనం, త్యాగం, జాలి, దయ, సేవాగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలంటూ దిశా నిర్దేశం చేసిన మాసం రంజాన్ అని తెలిపారు. పండుగను సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మరో ప్రకటన విడుదల చేశారు.
మే డే పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: మే డే సందర్భంగా ఇచ్చే శ్రమ శక్తి, పారిశ్రామిక ఉత్తమ యాజమాన్య పురస్కారాల కోసం ఏప్రిల్ 10వ తేదీలోగా నామినేషన్ ఫారాలు సమర్పించాలని ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ల నాయకులకు శ్రమ శక్తి పురస్కారాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులతో సఖ్యతగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతికి సహకరించిన మధ్య, పెద్ద తరహా పారిశ్రామిక యాజమాన్యాలకు ఉత్తమ యాజమాన్య పురస్కారాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు, యాజమాన్యాలు ఖమ్మం ఉప కార్మిక కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ ఫారాలు తీసుకుని పూర్తిచేశాక 10వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు.
బీసీ అభ్యర్థులకు ఉచిత బ్యాంకింగ్ శిక్షణ
ఖమ్మం రాపర్తినగర్: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యాన బీసీ ఆభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. నెల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇప్పించడమే కాక ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకుంటే 12న ఆన్‌లైన్ ట్రైనింగ్ టెస్ట్ నిర్వహించి ప్రతిభ ఆధారంగా 30 మందిని ఎంపిక చేస్తామని తెలిపారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. వివరాల కోసం www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల ప్రవేశానికి 20న పరీక్ష
ఖమ్మంసహకారనగర్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా బీసీ గురుకుల విద్యాసంస్థల ప్రాంతీయ సమన్వయ అధికారి సీహెచ్.రాంబాబు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 24 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా, అందులో 6వ తరగతికి బాలికలకు 249, బాలురకు 249 సీట్లు, 7వ తరగతిలో బాలికలకు 170, బాలురకు 177, 8వ తరగతిలో బాలికలకు 97, బాలురకు 124, 9వ తరగతిలో బాలికలకు 139, బాలురకు 184 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు రూ.150 రుసుముతో ఈనెల 31వ తేదీ(సోమవారం)లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉషూలో అన్నాచెల్లెలికి పతకాలు
ఖమ్మం స్పోర్ట్స్ : జాతీయస్థాయి ఫెడరేషన్ కప్ ఉషూ టోర్నీలో ఖమ్మం నగరానికి చెందిన అన్నాచెల్లెలుకు పతకాలు లభించాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఈనెల 24 నుంచి 28 వరకు జరిగిన పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి పతకాలు దక్కించుకోవడం విశేషం. ఈ పోటీల్లో పి.పవి త్రాచారికి నాన్‌క్వాన్, ట్రెడిషనల్ సింగిల్ వెపన్‌లో కాంస్య పతకం లభించగా, పి.సత్యజిత్‌చారికి తైజిక్వాన్‌లో కాంస్య పతకం దక్కింది. జాతీయస్థాయిలో వీరు ప్రతిభ కనబర్చగా డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి అభినందించారు.