
నేడు ఈదుల్ ఫితర్
సత్తుపల్లి: ‘అల్లాహు అక్బర్.. అల్లాహు అక్బర్..’ అంటూ నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సోమవారం అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా పరస్పరం ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. షవ్వాల్ చాంద్(నెలవంక) ఆదివారం రాత్రి చూడగానే ఈదుల్ ఫితర్(రంజాన్) పండుగ ఏర్పాట్లలో ముస్లింలు నిమగ్నమయ్యారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింల సందడితో పండుగ శోభ సంతరించుకుంది. జిల్లాలోని ఈద్గాలన్నింటినీ ముస్తాబు చేశారు.
నెల రోజుల కఠిన ఉపవాస దీక్ష..
30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు రంజాన్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. తప్పనిసరిగా తెల్లవారుజామున ‘ఫజర్’ నమాజ్ ఆచరించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాల్సి ఉంటుంది. నమాజ్‌కు వెళ్లే ముందు పవిత్రంగా(గుసూల్) తల స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి, అత్తరు పూసుకుంటారు. తప్పని సరిగా సేమియా(ఏదైనా తీపి పదార్థం) తిని వజూ చేసుకుని నమాజ్ కోసం ఈద్గాలకు వెళ్తారు.
విధిగా ఫిత్రా దానం..
ఫిత్రాల పేరుతో ఈ పండుగను ‘ఈదుల్ ఫితర్’గా పిలుస్తుంటారు. ఆర్థికంగా ఉన్నవారు ఫిత్రా (దానం) తప్పనిసరిగా చెల్లించి ఈదుల్ ఫితర్ నమాజ్ చదవాలి. పండుగ రోజు పుట్టిన బిడ్డకు కూడా ఫిత్రా దానం ఇవ్వాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో రెండున్నర కిలోల గోధుమల ధర ఎంత ఉంటుందో అంత ఫిత్రా చెల్లించాలి. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.80చొప్పున ప్రతి ఒక్కరు ఫిత్రా చెల్లించాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. అయితే అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వవచ్చు. ఫిత్రా దానంతో పేదలు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే అవకాశం ఉంటుంది.
రంజాన్ వేడుకలకు ముస్తాబైన
మసీదులు, ఈద్గాలు

నేడు ఈదుల్ ఫితర్