
గ్రూప్–1 ఫలితాల్లో ప్రతిభ
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా వాసులు సత్తాచాటారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని ఎన్నో కష్ట, నష్టాలకోర్చి చేరుకున్నారు. పుస్తకాలతో గంటల తరబడి కుస్తీపడుతూ.. ఏమాత్రం సమయం వృథా చేయకుండా చదివి అనుకున్నది సాధించారు. ప్రస్తుత యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు.
●ఐఏఎస్ కావడమే లక్ష్యం
వైరా: సివిల్స్‌లో ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడమే లక్ష్యమని చెబుతున్న వైరాకు చెందిన యువతికి గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 129వ ర్యాంకు వచ్చింది. మల్టీజోన్–1లో 49వ ర్యాంకు సాధంచిన సంగెపు లక్ష్మీసాహితి తండ్రి వెంకటేశ్వరరావు ఎల్‌ఐసీలో బీమా ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి కవిత గృహిణి. ఆమె 1 నుంచి 7వ తరగతి వరకు వైరా మధు విద్యాలయం, 8 నుంచి 10 వరకు ఖమ్మం రెజొనెన్స్ పాఠశాల, ఇంటర్ శ్రీచైతన్య కళాశాలలో చదివి డిగ్రీ హైదరాబాద్ నారాయణ కళాశాలలో చదివింది. పీజీ హైదరాబాద్ రామిరెడ్డి కళాశాలలో పూర్తిచేసింది. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. 2021లో యూపీఎస్‌సీ పరీక్షకు హాజరైంది. ‘రెండు సార్లు సివిల్స్ రాశాను. రెండోసారి రెండు మార్కులలో ర్యాంకు కోల్పోయాను. ఎప్పటికై నా సివిల్స్ సాధించడమే లక్ష్యం’ అని లక్ష్మీసాహితి వివరించింది.