
●తల్లి కష్టంతో..
ఖమ్మంమయూరిసెంటర్: చిన్ననాటి నుంచి తనను చదివించేందుకు తన తల్లి పడిన కష్టాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఖమ్మం నగరం ఖానాపురానికి చెందిన ఎం.మురళి గ్రూప్–1 ఫలితాల్లో మెరిశాడు. రాష్ట్రస్థాయి 83వ ర్యాంకు, బీసీ–ఏ కేటగిరిలో 2వర్యాంక్, జోనల్‌స్థాయిలో 47వ ర్యాంకు సాధించాడు. మురళి ఇప్పటికే ఖమ్మం నగర పాలక సంస్థలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు మురళి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018లో టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, 2020లో సివిల్ కానిస్టేబుల్, 2024లో జూనియర్ అకౌంటెంట్ (గ్రూప్–4) సాధించడంతోపాటు తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో 489.5 మార్కులు సాధించాడు.మురళి తండ్రి లక్ష్మీనారాయణ 1998లో చనిపోగా.. తల్లి కళావతి కేఎంసీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ చదివించుకుంది. 2020లో తల్లి కళావతికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇంటి వద్దే ఉంచి ఆమె ఆలనాపాలనా మురళి చూస్తున్నాడు.