
పెంచలేదని అనకుండా..
● ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం రూ.7 పెంపు ● ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం ● వేసవిభత్యం ఊసే ఎత్తని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ఈసారి నామమాత్రంగానే వేతనం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒక్కో కూలీకి రూ.300 చెల్లిస్తుండగా.. ఈసారి మరో రూ.7పెంచుతూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మంగళవారం నుంచి కూలీలకు రూ.307 చెల్లించనున్నారు. అతి తక్కువగా వేతనం పెంచడంపై కూలీల్లో నిరాశ అలుముకుంది.
నాలుగో వంతు
ఏటా ఉపాధి కూలీల వేతనాన్ని రూ.15నుంచి రూ.25మేర పెంచుతున్నారు. దీంతో ప్రస్తుతం కూలీలకు రూ.300 అందుతుండగా ఈసారి అతి తక్కువగా రూ.7మాత్రమే పెంచడం గమనార్హం. 2024–25 ఏడాదికి రూ.28 పెంచిన కేంద్రం.. 2025–26కు అందులో నాలుగో వంతు మాత్రమే పెంచడంతో కూలీలు పనులపై విముఖత చూపే అవకాశం కనిపిస్తోంది.
58.28 లక్షల పనిదినాలు పూర్తి
2024–25 ఏడాదిలో 62.17 లక్షల పనిదినాలకు గాను 58.28 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. ఇందులో 1,419 కుటుంబాలు వంద రోజుల పనిదినాలు పూర్తి చేశాయి. ఈ పనుల కోసం రూ.204.99 కోట్లు వెచ్చించగా.. అందులో రూ.127.39 కోట్లు కూలీలకు వేతనంగా, రూ.67.27 కోట్లు సామగ్రి కోసం ఖర్చు చేశారు. మరో రూ.10 కోట్లు కార్యకలాపాలు, ఉద్యోగుల వేతనాలు, కార్యాలయాల నిర్వహణకు వెచ్చించారు.
ఈసారి 54 లక్షల పనిదినాలే
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని వేసవి సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లడానికి కూలీలు ఆసక్తి కనబరుస్తారు. జిల్లాలోని చాలా మండలాల్లో కూలీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈనేపథ్యాన ఉపాధి హామీ పనిదినాల లక్ష్యాలను కేంద్రమే నేరుగా పర్యవేక్షిస్తోంది. ఉపాధి పథకం పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, బ్లాక్(మండలం), జిల్లాకు పనిదినాల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈమేరకు జిల్లా నుంచి 2025–26 ఆర్ధిక సంవత్సరంలో 54,33,704 పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. తాజాగా ముగిసిన ఏడాదిలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరకపోవడంతోనే ఈసారి పనిదినాల సంఖ్య తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రతిపాదనల ఆధారంగా నెలవారీ లక్ష్యాలను కేంద్రప్రభుత్వం ప్రకటించనుండగా.. అందుకు అనుగుణంగా జిల్లాలో కూలీలకు పనులు కల్పిస్తారు.
జిల్లాలో ‘ఉపాధి’ వివరాలు
జాబ్‌కార్డులు 3.06 లక్షలు
కూలీల సంఖ్య 6.43 లక్షలు
యాక్టివ్ జాబ్‌కార్డులు 1.83 లక్షలు
యాక్టివ్ కూలీలు 3.08 లక్షలు