
ముందుకొస్తే.. రాయితీ
● ఈ నెల 30లోగా ఆస్తి పన్ను కడితే ఐదు శాతం రిబేట్ ● కేఎంసీ, మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులకు అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: పుర, నగర పాలక సంస్థలకు నిధుల లేమి నుండి ఊరట లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రకటించింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఈ పథకం ద్వారా ఐదు శాతం రాయితీ లభిస్తుంది. దీంతో ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఎక్కువ మొత్తంలో ఇంటి పన్నులు వసూలు చేసేలా ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 82,148 అసెస్‌మెంట్లు ఉండగా.. 51,771 అసెస్‌మెంట్లకు 5శాతం రాయితీ దక్క నుంది. దీంతో వీరందరూ ఈ నెలలోనే పన్ను చెల్లించేలా అవగాహన కల్పించనున్నారు.
ఈనెలాఖరు వరకు రాయితీ..
ఉమ్మడి జిల్లాలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మధిర, వైరా, సత్తుపల్లి, ఏదులాపురం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ యా ప్రాంతాల్లో ఆస్తిపన్ను ఈనెలలో చెల్లిస్తే ప్రభుత్వం ఇచ్చే ఐదు శాతం రాయితీ అమలవుతుంది. 2024–25 ఏడాది వరకు పూర్తిగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి మాత్రమే పన్ను రాయితీ అందుతుందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ మార్చి వరకు ఉన్న బకాయిలను జరిమానాతో చెల్లించి, 2025–26 ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లించినా ఐదుశాతం రాయితీ వస్తుందని తెలిపారు. ఈమేరకు ఈనెల 30వ తేదీ లోగా సీడీఎంఏ వెబ్‌సైట్ ద్వారా పన్ను చెల్లించాలని సూచించారు.