
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగపడనున్నందున యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీ వరకు వరకు రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆన్‌లైన్‌లో లేదా ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ యూనిట్లు మంజూరవుతాయని, వ్యవసాయేతర యూనిట్లకు 21–55 ఏళ్లు, వ్యవసాయ యూనిట్లకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఆధాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. పత్రాల అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు మూడు రోజుల్లో జారీ చేసేలా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. మండల, గ్రామ జనాభాకు అనుగుణంగా కేటాయించిన లక్ష్యాల ప్రకారం యూనిట్ల మంజూరు ఉంటుందని, పత్రాల కారణంగా మంజూరు ఆపబోమని తెలిపారు. స్క్రూ టినీని ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనుండగా.. యూనిట్ల ఆధారంగా అభ్యర్థులకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు. అర్హులందరికీ బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సరిగా పనిచేయని డీలర్లపై చర్యలు
జిల్లాలోని అన్ని రేషన్‌షాప్‌ల ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ వెల్లడించారు. ఇదేసమయాన డీలర్ల యాజమాన్య వివరాలను తనిఖీ చేస్తూ, సరిగ్గా పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జ్ ఈడీ నవీన్‌బాబు, బీసీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ అధికారులు జి.జ్యోతి, ఎన్.విజయలక్ష్మి, డాక్టర్ బి.పురంధర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శ్రీలత పాల్గొన్నారు.
బ్యాంక్ లింకేజీ
రుణాల మంజూరుపై దృష్టి
అన్ని రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్