
మరో 28 రోజులు ఎల్‌ఆర్‘ఎస్’
● ఈనెల 30 వరకు గడువు పెంచిన ప్రభుత్వం ● జిల్లాలో ఇప్పటివరకు రూ.66.32 కోట్ల ఆదాయం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌ఆర్‌ఎస్(లే ఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ద్వారా స్థలాల క్రమబద్ధీకరణకు ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ఈ గడువును మరికొద్ది రోజులు పొడిగించింది. ఏళ్లుగా పెండింగ్ ఉన్న దరఖాస్తులను పరిష్కరించేలా ప్రభుత్వం ఫిబ్రవరి 20న రాయితీ ప్రకటించింది. గత నెల 31వ తేదీతో గడువు ముగియగా ఆశించిన స్థాయిలో స్పందన రాని కారణంగా గడువు పెంచింది.
ఖమ్మంకు రాష్ట్రంలో రెండో స్థానం..
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లలో దరఖాస్తుల పరిశీలన, అనుమతి, ఫీజు చెల్లింపుల్లో వరంగల్ తర్వాత ఖమ్మం కార్పొరేషన్ రెండో స్థానంలో నిలిచింది. కేఎంసీ పరిధిలో 40,182 దరఖాస్తులు రాగా.. 28,783 మంది ఫీజు చెల్లించేందుకు అనుమతి లభించింది. ఇందులో 7,071 మంది ఫీజు చెల్లించారు. 25శాతం రాయితీ అమల్లోకి వచ్చిన నాటినుంచి ఫ్లెక్సీలు, ఇతర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో లబ్ధిదారులు ఫీజు చెల్లించేందుకు ముందుకొచ్చినా మార్చి నెలాఖరులో కొన్ని సమస్యల కారణంగా ఇబ్బంది ఏర్పడింది.
మున్సిపాలిటీల్లో నత్తనడకన
కేఎంసీలో ఈ ప్రక్రియ వేగంగానే ఉన్నా, మున్సిపాలిటీల్లో మాత్రం నత్తనడకన కొనసాగుతోంది. సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో ఫీజు చెల్లించేందుకు పలువురు ఇంకా ముందుకు రావడం లేదు. ఈ మున్సిపాలిటీల్లో 25,002 దరఖాస్తులకు గాను 19,443 దరఖాస్తులకు అనుమతి జారీ చేసి లబ్ధిదారులకు సమాచారం ఇచ్చారు. కానీ ఇందులో కేవలం 3,220 మందే ఫీజు చెల్లించడం గమనార్హం. ప్రస్తుతం గడువు పెంచిన నేపథ్యాన మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది ఫీజు చెల్లించేలా అవగాహన కల్పించాల్సిన అవసరముంది. లబ్ధిదారులు కూడా ముందుకొస్తే వారి స్థలాలపై చట్టబద్ధమైన హక్కులు దక్కనున్నాయి.
కార్పొరేషన్‌దే సింహభాగం
ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ ద్వారా నమోదైన ఆదాయంలో అత్యధిక భాగం ఖమ్మం కార్పొరేషన్ నుంచే వచ్చింది. ఖమ్మం కార్పొరేషన్, సుడా, సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం మున్సిపాలిటీల్లో కలిపి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.66.32 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.39.93 కోట్లు కేఎంసీ పరిధి నుంచే రావడం విశేషం. ఖమ్మం కార్పొరేషన్లలో స్థలాలు ఉండి క్రయవిక్రయాలకు ఇబ్బంది ఎదురవుతుండడంతో ఎల్‌ఆర్‌ఎస్ స్కీమ్ వైపు మొగ్గు చూపారు. కాగా, వైరా మున్సిపాలిటీలో రూ.1.58 కోట్లు, మధిర మున్సిపాలిటీలో రూ.3.2 కోట్లు, ఏదులాపురంలో రూ.7.25 కోట్లు, సత్తుపల్లి మున్సిపాలిటీలో రూ.2.39 కోట్లు ఆదాయం రాగా, సుడా పరిధిలో రూ.11.97 కోట్లు లభించాయి.
గత నెల 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల వివరాలు
మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు అనుమతి చెల్లించింది
ఖమ్మం 40,182 28,783 7,071
వైరా 3,529 3,125 400
మధిర 4,287 3,744 602
ఏదులాపురం 13,496 9,459 1,726
సత్తుపల్లి 3,690 3,115 492
సుడా 21,021 19,482 4,664