
ముంచెత్తిన ఎర్రబంగారం
● ఖమ్మం మార్కెట్‌కు 70వేలకు పైగా బస్తాల మిర్చి ● ధర పతనంతో రైతుల్లో ఆవేదన
ఖమ్మంవ్యవసాయం: నాలుగు రోజుల సెలవుల అనంతరం బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్రయవిక్రయాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలమూలల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి సైతం రైతులు మిర్చితో మంగళవారం సాయంత్రం నుంచే రావడం మొదలుపెట్టారు. దీంతో బుధవారం ఉదయంకల్లా 70వేలకు పైగా బస్తాల మిర్చి రావడంతో మార్కెట్ నలుమూలలా ఎర్రబంగారంతో నిండిపోయింది.
పురోగతి లేని ధర
మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది. ఓ పక్క విదేశీ ఎగుమతులు లేకపోవడం, మరోవైపు విక్రయాలు పెరగడం ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ సాగు చేసే తేజా రకం మిర్చిని చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. గత ఏడాది ఆర్డర్లు ఉండడంతో క్వింటాకు రూ.20నుంచి రూ.23 వేల మేర ధర పలికింది. ఈసారి చైనాలోనే పంట సాగవడంతో ఆశించిన స్థాయిలో ఆర్డర్లు లేక ధరపై ప్రభావం చూపిస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో రూ.16వేల వరకు నమోదైన ధర మార్చి 10వ తేదీ వరకు గరిష్టంగా రూ.14వేలు పలికింది. ఆతర్వాత ఇంకా తగ్గుతూ రూ.13,300కు చేరడం గమనార్హం. అయితే, గరిష్ట ధరతో పొంతన లేకుండా నాణ్యత పేరిట దాదాపు రూ.2వేలకు పైగా తగ్గించి ఎక్కువ సరుకును రూ.11వేల నుంచి రూ.11,500తోనే కొనుగోలు చేస్తున్నారు.
ఏపీ ప్రభావం కూడా..
ఖమ్మం మార్కెట్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతులు మిర్చి తీసుకొస్తున్నారు. సగటున లక్ష బస్తాల వరకు మిర్చి విక్రయానికి వస్తున్న నేపథ్యాన విదేశీ ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు తక్కువ ధర నిర్ణస్తున్నారు. దీనికి తోడు ఏపీ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం పీడీపీసీ(ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ స్కీం)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మిర్చి క్వింటా ధర రూ.11,718గా నిర్ణయించారు. ఏపీ రాష్ట్రం ఖమ్మంకు పొరుగునే ఉండడంతో అక్కడి ధర చెల్లించినా ఇబ్బంది లేదనే భావనతో వ్యాపారులు కాస్త అటూఇటుగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది.
కొద్దినెలలుగా ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధరలు (రూ.ల్లో)
తేదీ గరిష్టం మోడల్
డిసెంబర్ 9 16,500 16,000
20 16,000 15,600
జనవరి 17 15,500 15,000
24 15,000 14,800
ఫిబ్రవరి 2 14,200 13,700
24 14,125 13,600
మార్చి 10 14,000 13,300
18 13,700 12,000
19 13,500 11,500
25 13,350 11,000
ఏప్రిల్ 2 13,300 12,000
ఈ ఏడాది నష్టమే...
ఈ ఏడాది ఎకరాకు శ్రమ కాక రూ.30వేల నుంచి రూ.50వేల వరకు నష్టం వాటిల్లింది. రెండు ఎకరాల్లో మిర్చి సాగుచేయగా, 55 బస్తాలు విక్రయానికి తీసుకువచ్చా. నాణ్యత లేదని క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.13 వేలే చెల్లించారు. అయినా అవసరాల రీత్యా అమ్మక తప్పలేదు.
– బ్రహ్మయ్య, చిమ్మపుడి,
రఘునాథపాలెం మండలం
ధర బాగా పడిపోతోంది..
వ్యాపారులు చెప్పిన ధరకు అమ్మక తప్పని పరిస్థితి ఉంది. 13 బస్తాల మిర్చి విక్రయానికి తీసుకువచ్చా. రూ.12వేల ధర పెట్టారు. నాణ్యత లేదని మరో ఆరు బస్తాల మిర్చి క్వింటాకు రూ.10వేలే చెల్లించారు. ఈ ధరతో పెట్టుబడులు కూడా పూడవు. నెల క్రితం కన్నా ధర మరింత పడిపోయింది.
– భూక్యా అమ్రు, మరిపెడ,
మహబూబాబాద్ జిల్లా

ముంచెత్తిన ఎర్రబంగారం

ముంచెత్తిన ఎర్రబంగారం