
లక్ష్యాన్ని అధిగమించి..
● అధిక ఆదాయం సాధించిన మార్కెట్లు ● మార్కెట్ల ఫీజు రూ.65.56 కోట్లుగా నమోదు ● ఇందులో ఖమ్మం మార్కెట్ వాటా రూ.30.57 కోట్లు ● కాస్త వెనుకబడిన నేలకొండపల్లి, ఏన్కూరు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల ఆదాయం పెరిగింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి మించి మార్కెట్ ఫీజులు వసూలయ్యాయి. జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్ల ఫీజు లక్ష్యం రూ.63.94 కోట్లు కాగా రూ.65.56 కోట్లు అంటే అదనంగా రూ.1.62 కోట్లు వసూలయ్యాయి. నేలకొండపల్లి, ఏన్కూరు మినహా అన్ని మార్కెట్లు లక్ష్యాన్ని దాటడం విశేషం. పంట విక్రయాల ధర ఆధారంగా కొనుగోలు చేసిన వ్యాపారులు, సంస్థల నుంచి మార్కెటింగ్ శాఖ ఒక శాతం పన్ను వసూలు చేస్తుంది. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవటం, జలాశయాల్లో నీరు ఉండడంతో పంటలు, ఉత్పత్తి ఆశాజనకంగా ఉంది. మిర్చితో పోలిస్తే మిగతా పంటలు ధరలు బాగానే ఉండడంతో పన్ను అదేస్థాయిలో వసూలైంది. మిర్చి ధర కూడా బాగుంటే మార్కెట్ల ఆదాయం మరింత పెరిగేది.
సగం ఖమ్మం నుంచే..
జిల్లాకు నిర్దేశించిన లక్ష్యంలో సగభాగం ఖమ్మం మార్కెట్ నుంచే వసూలైంది. రాష్ట్రంలో పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ఒకటి కాగా, ‘తేజా’ రకం మిర్చి కొనుగోళ్లు జోరుగా సాగుతుండడంతో ఈ మార్కెట్ ఫీజు లక్ష్యాన్ని దాటింది. ఖమ్మం మార్కెట్‌కు రూ.30.02 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. రూ.55 లక్షలు అదనంగా కలిపి రూ.30.57 కోట్లు వసూలవడం విశేషం. ఇది గతేడాదితో పోలిస్తే రూ.3 కోట్లు అదనమని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా ముందుకొస్తే..
ఖమ్మం, మధిర, కల్లూరు, వైరా, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లు లక్ష్యానికి మించి ఫీజు వసూలు చేయగా, నేలకొండపల్లి, ఏన్కూరు మార్కెట్లు వెనుకబడ్డాయి. నేలకొండపల్లి మార్కెట్‌కు రూ.3.78 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.66 కోట్లు, ఏన్కూరు మార్కెట్ రూ.4.87 కోట్లకు గాను రూ.3.43 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వ సంస్థల నుంచి ఫీజులు పూర్తిస్థాయిలో వసూలైతే మార్కెట్లకు మరింతగా ఆదాయం పెరిగే అవకాశముంది.
2024–25లో మార్కెట్ల వారీగా ఆదాయం (రూ.లక్షల్లో)
మార్కెట్ లక్ష్యం వసూలు
ఖమ్మం 3002.85 3057.91
మధిర 475.19 484.20
నేలకొండపల్లి 378.34 366.48
కల్లూరు 567.38 678.28
వైరా 673.58 694.93
ఏన్కూరు 487.70 343.18
సత్తుపల్లి 494.79 601.44
మద్దులపల్లి 315.10 330.04
మొత్తం 6,394.93 6,556.46