
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..
నేలకొండపల్లి/ముదిగొండ: అభిృవృద్ధి పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా శరవేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో గురువారం పర్యటించిన ఆమె తొలుత నేలకొండపల్లిలో ఏళ్లుగా సాగుతున్న గ్రంథాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇకనైనా పనులు శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత మండల పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువశక్తి పథకం కౌంటర్, ఎంఈఓ కార్యాలయంలో యూనిఫాం వస్త్రం పరిశీలించగా, పలుచోట్ల డ్రెయినేజీలు, రోడ్లను శుభ్రం చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని ఆమె ఆదేశించారు. ఆ తర్వాత ముదిగొండ మండలంలోని ముదిగొండ, గోకినేపల్లిల్లో గ్రంఽథాలయాలను అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించి, ముదిగొండలో భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనం నిర్మించే వరకు ఇతర చోటకు మార్చాలని సూచించారు. ఎంపీడీఓలు యం.యర్రయ్య, శ్రీధర్‌స్వామి, ఎంపీఓ సీహెచ్ శివ, ఐకేపీ ఏపీఎం శ్రీనివాసరావు, లైబ్రేరియన్ మచ్చా సత్యనారాయణ పాల్గొన్నారు.