
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం
కూసుమంచి: మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో 50మంది మత్స్యకారులకు వలలు, చేపలు పట్టే సామగ్రిని ఆయన పంపిణీ చేశారు. పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందిన మత్స్యకారులకు న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఆర్థిక సహకారంతో వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యరంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేలా ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ, చేయూతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత పలువురు దివ్యాంగులకు త్రీ వీలర్ మోపెడ్ వాహనాలను మంత్రి అందజేశారు. అంతేకాక సబ్ స్టేషన్ ఆవరణలో రూ.35 లక్షలతో నిర్మించే కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి.. సంక్షేమం
నేలకొండపల్లి: అభివృద్ధి పనులు చేపడుతూనే సంక్షేమ పథకాలు నిరాటంకంగా సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన మంత్రి, బోదులబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో అనంతనగర్‌లో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అప్పుల భారాన్ని మోపితే వడ్డీలు కడుతూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎన్పీడీసీఎల్ సీఈ రాజుచౌహాన్, ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఆర్డీఓ నర్సింహారావు, జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, డీఏఓ పుల్లయ్య, పౌర సరఫరా సంస్థ మేనేజర్ శ్రీలత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ కరుణశ్రీ, ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి, పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్యాంప్రసాద్, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములుతో పాటు వి.రమ్య, భద్రయ్య, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, బొందయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ, గుండా బ్రహ్మం, కడియాల నరేష్, బోయిన వేణు, బొర్రా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పైనంపల్లి కార్యదర్శిపై సీరియస్
నేలకొండపల్లి మండలం పైనంపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్.నరసింహారావుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, కార్యదర్శి అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా కార్యదర్శిని పిలిపించిన మంత్రి మందలించారు. ఆయనను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయమై ఎంపీడీఓ ఎం.ఎర్రయ్యను వివరణ కోరగా కార్యదర్శిని డీపీఓ కార్యాలయానికి సరెండర్ చేశామని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి