
అన్ని గురుకులాలు ఒకేచోట..
వైరా: నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు.వైరాలోని కేవీసీఎం డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల ప్రాంగణాలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇంటిగ్రేడెట్ గురుకుల భవనాలు ఎక్కడ నిర్మించాలనే అంశంపై స్థలాల పరిశీలన చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంగణాల్లో బాలురు, బాలికలకు విడివిడిగా భవనాలు నిర్మిస్తామని, నెలలోగా స్పష్టత వస్తుందని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమతో మాట్లాడిన కలెక్టర్ పదో తరగతి విద్యార్థినులు పరీక్షలు ఎలా రాశారో ఆరాతీయడమే కాక ఫలితాలు వచ్చాక ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను కలెక్టరేట్‌కు తీసుకురావాలని సూచించారు. ఆర్‌డీఓ నరసింహారావు, తహసీల్దార్ కే.వీ.శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీకాంత్, విక్రమ్ ఉన్నారు.
సన్న బియ్యం రవాణాలో వేగం
ఖమ్మం సహకారనగర్: జిల్లాల్లోని అన్నిరేషన్ షాపులకు సన్న బియ్యం త్వరగా చేరవేసి పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి వివిధ అంశాలపై కలెక్టర్లేతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో ఇన్నాళ్లు దొడ్డు బియ్యం సరఫరా చేసినా చాలా మంది తీసుకోలేదన్నారు. దీంతో ఉచితంగా సన్న బియ్యం సరఫరాకు నిర్ణయించామని తెలిపారు. ఈమేరకు రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి త్వరగా షాపులకు చేర్చడంతో పాటు సరఫరాలో అక్రమాలు జరగకుండా చూడాలని సూచించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ షాప్‌ల వద్ద రద్దీ దృష్ట్యా అవసరమైన బియ్యం సమకూర్చాలని, నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనలో పెంచాలని తెలిపారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
‘ఇంటిగ్రేటెడ్’ స్థల పరిశీలనలో కలెక్టర్