ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి సమేత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల కల్యాణం జరిపించారు. ఇటీవల నిర్మించిన వకుళామాత స్టేడియానికి శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తోడ్కొని వచ్చిన అర్చకులు పట్టువస్త్రాలతో అలంకరించాక కల్యాణ క్రతువు ఆరంభించారు. ఈక్రమాన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం నుంచి తీసుకొచ్చిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు దంపతులు సమర్పించగా, గ్రామపంచాయతీ అధికారులు, తుళ్లూరు కోటేశ్వరరావు దంపతులు సైతం నూతన వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం ప్రధాన, ముఖ్య అర్చకులు పురాణం రవికుమార్‌శర్మ, ఉప్పల శ్రీనివాసశర్మ, మురళీమోహన్‌శర్మ, రాజీవ్‌శర్మ తదితరుల నేతృత్వాన మధ్యాహ్నం 12–01 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామి కల్యాణ తంతు పూర్తిచేశారు. ఈసందర్భంగా స్టేడియం ప్రాంగణం గోవింద నామ స్మరణతో మార్మోగింది. అలాగే, గ్రామోత్సవం అనంతరం స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు–నిర్మల దంపతుల ఆధ్వర్యాన పెద్ద చెరువులో శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించగా, కుర్నవల్లికి చెంది శీలం వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యాన అన్నదానం చేశారు. ఆలయ ఽవ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఎంపీడీఓ సురేంద్రనాయక్, సొసైటీ చైర్మన్ ముల్పూరి శ్రీనివాసరావు, ఉద్యోగులు విజయకుమారి, జి.కుమార్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
జమలాపురంలో
తిలకించి పులకించిన భక్తజనం
కమనీయం... శ్రీవారి కల్యాణం