
గిరిజనుడి ఇంట సీఎంకు భోజనం
● ప్రభుత్వం అందించే సన్నబియ్యంతో.. ● ఏర్పాట్లను పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్
బూర్గంపాడు: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణం అనంతరం సారపాకకు చెందిన గిరిజనుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఆదివారం భోజనం చేయనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో పేదల ఇంట్లో భోజనం చేసి లబ్ధిదారులతో మాట్లాడాలనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి సీఎంఓ నుంచి శనివారం టూర్ షెడ్యూల్ కూడా విడుదలైంది. కాగా, శ్రీనివాస్ ఇంటిని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఇతర అధికారులు శనివారం పరిశీలించి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం అందించిన సన్నబియ్యంతోనే అన్నం వండి పప్పు, చారు, కూర, పచ్చడితో భోజనం వడ్డిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యాన పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నాయకపోడు తెగకు చెందిన గిరిజనుడి ఇంట భోజనానికి సీఎం రావడం సంతోషకరమని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గిరిజనుడి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు.