
కుండలు సరే.. తాగునీరు ఏదీ?
● కేఎంసీ పరిధిలోని అన్ని డివిజనల్లో ఇదే పరిస్థితి ● కొన్నిచోట్ల మాయమవుతున్న కుండలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఖమ్మం వస్తంటారు. ఎండల నేపథ్యాన వీరి దాహార్తి తీర్చేందుకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. లక్ష్యం మాత్రం చేరే పరిస్థితి కానరావడం లేదు. చలివేంద్రాల్లో మట్టికుండలు ఏర్పాటుచేసి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు తాగునీరు నింపకపోవడం గమనార్హం. అయితే, కార్పొరేటర్ల చేతుల మీదుగా ప్రారంభించాలనే భావనతో వేచి ఉన్నారని, అందుకే నీరు నింపడం లేదనే చర్చ జరుగుతోంది.
76 కేంద్రాల్లో ఏర్పాటు
ఖమ్మంలోని 60 డివిజన్ల పరిధిలో రద్దీ ఉండే 76 ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ బాధ్యత ఒక కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ అధికారులు చూపించిన ప్రాంతాల్లో చిన్న గుడిసె వేసి నాలుగు చొప్పున కుండలు ఏర్పాటు చేయడమే కాక ప్లాస్టిక్ గ్లాసులు పెట్టారు. ఆపై కుండల్లో రోజూ నీరు నింపే బాధ్యతను లైన్‌మెన్లకు అప్పగించినట్లు తెలిసింది. కానీ ఇప్పటివరకు ఎక్కడా నీరు నింపకపవడంతో చలివేంద్రం ఉంది కదా అని ఆశగా వచ్చిన వారు నిరాశగా వెనుదిరగక తప్పడం లేదు. ఇక కొన్నిచోట్ల ఒక్కో కుండ మాయమవుతూ నాలుగుకు బదులు రెండు, మూడు కుండలే కనిపిస్తున్నాయి.
భారీగా ఖర్చు..
కేఎంసీలో ఏ పని చేసినా.. నాలుగింతలు లాభం ఉండేలా అధికారులు అంచనాలు రూపొందించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే చలివేంద్రాల ఏర్పాటులో ఖర్చు భారీగా చూపించేలా బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. నాలుగు తడికలు, ఒక షేడ్ నెట్, నాలుగు కర్రలు, నాలుగు కుండలతో ఏర్పాటు చేసిన ఒక్కో చలివేంద్రానికి రూ.15 వేల నుండి రూ.18,750 వరకు ఖర్చయిందని బిల్లుల్లో పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా చలివేంద్రాల ఏర్పాటు పేరుతో సుమారు రూ.14 లక్షలకు పైగా బిల్లులు సిద్ధం చేసినట్లు చర్చ జరుగుతుంది. ఈ అంశంపై కేఎంసీ అధికారులను వివరణ కోరగా.. రెండు రోజుల్లో కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చి చలివేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కుండల్లో నీరు బాధ్యత లైన్‌మెన్లకు అప్పగించామని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

కుండలు సరే.. తాగునీరు ఏదీ?

కుండలు సరే.. తాగునీరు ఏదీ?