
కోడి కోయలేం.. తినలేం..!
● బర్డ్‌ఫ్లూ తర్వాత అమాంతం పెరిగిన ధర ● లభ్యత లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు ● కిలో చికెన్ ధర రూ.280 పైమాటే...
ఇష్టమున్నా దూరమయ్యాం..
మా ఇంట్లో చికెన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ బర్డ్‌ఫ్లూ భయంతో వండడం మానే శాం. రంజాన్ సమయంలో వాడకం మొదలుపెట్టినా ఇప్పుడు ధర పెరిగింది. బర్డ్‌ఫ్లూ ప్రచారం జరిగినప్పుడు ఫంక్షన్లలోనూ చికెన్ వంటకాలు తగ్గాయి.
– ఎం.డీ.ఆబీద్, సత్తుపల్లి
మూడు నెలలు నష్టపోయాం..
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో అమ్మకాలు లేకున్నా మూడు నెలల పాటు అద్దె, జీతాలు చెల్లించడంతో రూ.2.50 లక్షల మేర నష్టం వచ్చింది. ఇప్పుడు చికెన్ ధరలు పెరిగి వ్యాపారం సాగడం లేదు. ఆదివారాల్లోనే ఓ మోస్తరు వ్యాపారం ఉంటోంది.
– ఎస్.కే.ఖాసీం, చికెన్ వ్యాపారి, సత్తుపల్లి
సత్తుపల్లి: కోడిని చూడగలం కానీ కోయలేము.. తినలేము అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్ ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణమవుతోంది. జనవరి నెలలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రచారంతో చికెన్ తినడానికి జనం విముఖత కనబరిచారు. ఆ సమయాన చికెన్ కేజీ ధర రూ.140 నుంచి రూ.160 పలకగా.. ఫిబ్రవరిలో కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు మేళాలు నిర్వహిస్తే అక్కడకు పెద్దసంఖ్యలో జనం హాజరైనా కొనుగోలు మాత్రం ముందు రాలేదు. ఇక మార్చిలో రంజాన్ మాసం ప్రారంభమయ్యాక చికెన్ అమ్మకాలు కొద్దికొద్దిగా పెరగడం మొదలైంది. ఆ నెలంతా స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ.220 నుంచి రూ.240 వరకు పలకగా.. ఈనెలలో మాత్రం రూ.280 నుంచి రూ.300వరకు పలుకుతుండడం గమనార్హం. దీంతో బర్డ్ ఫ్లూ భయం పోయినా ధర మాత్రం బెంబేలెత్తిస్తున్నట్లవుతోంది.
కొందరే పెంచడంతో...
బర్డ్‌ఫ్లూకు తోడు రకరకాల కారణాలతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో అమ్మకాలు లేక పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు కోళ్లు పెంచేందుకు వెనుకడుగు వేశారు. ఫలితంగా కొన్ని హెచరిస్ కంపెనీల నిర్వాహకులు మాత్రమే కోళ్లు పెంచారు. ఇప్పుడు తినడానికి జనం ఆసక్తి చూపిస్తున్నా.. కోళ్ల లభ్యత లేకపోవడంతో ధర పెరుగుతోంది. లైవ్ కోడి కేజీ ధర రూ.150 నుంచి రూ.160 పడుతున్నందున తాము ధర పెంచి అమ్మకం తప్పడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.
మటన్ రూ.వెయ్యి..
రెండు నెలల క్రితం బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో జనం చికెన్ తినకుండా మటన్, చేపల వైపు దృష్టి సారించారు. తద్వారా డిమాండ్ పెరగడంతో రూ.900వరకు ఉన్న మటన్ కేజీ ధర రూ.వెయ్యికి పెంచారు. అలాగే, తెల్ల చేపలు(లైవ్) కూడా కేజీ రూ.200 ధర పలికాయి. ఇప్పుడు చికెన్ ధర కూడా రూ.300 మార్క్‌కు చేరుతుండడంతో అది తినలేక.. మటన్ కొనలేక మాంసం ప్రియుల్లో ఆవేదన వ్యక్తవుతోంది. కాగా, కోళ్ల లభ్యత పెరిగాక మరో చికెన్ ధర తగ్గే అవకాశముందని సెంటర్ల నిర్వాహకుల ద్వారా తెలిసింది.

కోడి కోయలేం.. తినలేం..!

కోడి కోయలేం.. తినలేం..!