
జిల్లా జైలులో జైళ్లశాఖ డీజీ తనిఖీ
ఖమ్మంరూరల్: రూరల్ మండలం రామన్నపేటలోని జిల్లా జైలును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యామిశ్రా ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఖైదీలతో మాట్లాడి మెనూ, వైద్య సదుపాయం, న్యాయ సాయం అందుతోందా అని ఆరా తీశారు. అలాగే, లైబ్రరీ, వంటగది, ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆమె జైలు ఆవరణలో బీరువాలు, బెంచీలు, ఫినాయిల్ తయారీ వివరాలు తెలుసుకున్నారు. తయారీ, అమ్మకం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.సంపత్, జైలు సూపరింటెండెంట్ ఏ.శ్రీధర్, జైలర్లు ఎ.సక్రు, జి.లక్ష్మీనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.