
విద్యార్థుల లక్ష్యాలకు అనుగుణంగా బోధన
వైరా: ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా విద్యార్థుల లక్ష్యాలను గుర్తించి అందుకు అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భద్రాచలంలో కల్యాణానికి హాజరైన డిప్యూటీ సీఎం హైదరాబాద్ వెళ్తూ తన స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం వచ్చారు. అక్కడ భట్టి విక్రమార్క – నందిని దంపతులు గ్రామంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశాక అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆతర్వాత ఇటీవల గ్రూప్–1లో ర్యాంకు సాధించిన వైరాకు చెందిన సంగెపు లక్ష్మీ సాహితిని భట్టి సన్మానించారు. అనంతరం వైరాకు వచ్చిన డిప్యూటీ సీఎం తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఇదే ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యాన స్థలాన్ని పరిశీలించి అధికారులతో చర్చించారు. ఆతర్వాత ఆయన అరుగుపై కూర్చుని విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, మెనూ సక్రమంగా అమలవుతోందా, రాత్రివేళ కేర్ టేకర్లు ఉంటున్నారా అని తీస్తూ వివరాలు సేకరించారు. ఆపై డైనింగ్ హాల్‌కు వెళ్లి మెనూ చార్జ్ ఆధారంగా ఏమేం వండారో తెలుసుకున్న భట్టి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కాగా, డిప్యూటీ సీఎం వచ్చిన సమయాన పాఠశాల ప్రిన్సిపాల్ రమ లేకపోవడంతో ఇన్‌చార్జ్ వార్డెన్ వివరాలు వెల్లడించింది. అంతకు ముందు వైరాలో 100 పడకల అస్పత్రి భవన నిర్మాణ స్థలాన్ని కూడా డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఈకార్యక్రమాల్లో వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఏసీపీ ఎం.ఏ.రెహమాన్‌తో పాటు నూతి సత్యనారాయణ, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డపుల్లయ్య, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క