
గ్యాస్ బండ.. భారం
● పెరిగిన గృహావసరాల సిలిండర్ ధరలు ● ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనం
ఖమ్మం సహకారనగర్: కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయంతో సామాన్యులపై భారం పడనుంది. సుమారు రెండేళ్ల తర్వాత ఒకేసారి గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.50పెంచుతూ సోమవారం నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచే అమలవుతుందని కొందరు చెబుతున్నా... ఇంకొందరు డీలర్లు మాత్రం తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పడం గమనార్హం.
4లక్షలకు పైగా కనెక్షన్లు
జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 33 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,20,713 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,14,988, డబుల్ సిలెండర్లు కనెక్షన్లు 1,03,876తో పాటు దీపం పథకం ద్వారా 78,456, సీఎస్‌ఆర్ పథకం కింద జారీ చేసిన 23,393 కనెక్షన్లు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రూ.834గా ఉన్న సిలిండర్ ధరను రూ.50పెంచడంతో రూ.884కు చేరుతుంది. ఇక రూ.1,929.50గా ఉన్న వాణిజ్య అవసరాల సిలిండర్ ధరలో లాంటి మార్పు చేయలేదు.
నెలకు రూ.15కోట్లకు పైగా భారం
పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. జిల్లాలోని 4లక్షల మందికి పైగా వినియోగదారుల్లో 3లక్షల మంది నెలకోసారి సిలిండర్ వినియోగించినా రూ.50చొప్పున రూ.15కోట్ల భారం అదనంగా పడడం ఖాయమని తెలుస్తోంది. కానీ డీలర్లు మాత్రం కొత్త ధర అమలుపై స్పష్టత ఇవ్వడం లేదు. కాగా, పెరిగిన ధరలకు అనుగుణంగా వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని కేంద్రప్రభుత్వం సవరిస్తుందని కొందరు చెబుతున్నారు. ఇక రాష్ట్రప్రభుత్వం రూ.500కే కొందరికి సిలిండర్ ఇస్తోంది. వీరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టత రావాల్సి ఉంది.