సంఘాల నాయకులతో నేడు సమావేశం | - | Sakshi
Sakshi News home page

సంఘాల నాయకులతో నేడు సమావేశం

Apr 8 2025 10:54 AM | Updated on Apr 8 2025 10:54 AM

సంఘాల

సంఘాల నాయకులతో నేడు సమావేశం

ఖమ్మంమయూరిసెంటర్‌: రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల తీరుతెన్నులను వివరించేందుకు మంగళవారం కుల సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటుచేస్తునట్లు బీసీడబ్ల్యూఓ జి.జ్యోతి తెలిపారు. కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో జరిగే సమావేశానికి బ్రాహ్మణ, కమ్మ, కరణం, రెడ్డి, వెలమ, వైశ్య, ఓబీసీ, బీసీ, ఎంబీసీ ఫెడరేషన్‌ సంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు.

ఎంఈఓ, ప్రిన్సిపాల్‌ సహా ముగ్గురికి షోకాజ్‌ నోటీసు

వైరా: వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో మెనూ సక్రమంగా అమలుచేయడం లేదని తేలడంతో ప్రిన్సిపాల్‌, ఉద్యోగితో పాటు ఎంఈఓకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సాయంత్రం పాఠశాలను తనిఖీ చేయగా మెనూ పాటించడం లేదని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ గురుకులానికి చేరుకుని విచారణ చేపట్టారు. మెనూ ప్రకారం ఆదివారం నాన్‌వెజ్‌ అందించాల్సి ఉన్నా ఎందుకు సమకూర్చలేదని ఆరాతీయగా బర్డ్‌ ఫ్లూ భయంతో అందించలేదని ప్రిన్సిపాల్‌ రమ, ఏటీపీ రోహిణి బదులిచ్చారు. దీంతో వీరికే కాక పర్యవేక్షణ లోపం ఉన్న కారణంగా ఎంఈఓ కె.వెంకటేశ్వరరావుకు డీఈఓ ద్వారా షోకాజ్‌ నోటీసులు జారీ చేయించారు.

కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సైన్స్‌ విద్యార్థులకు ఇస్తున్న ఉచిత ఎప్‌సెట్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం అంబేద్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించిన ఆమె శిక్షణకు హాజరైన విద్యార్థులోతో మాట్లాడారు. డీఐఈఓ కె.రవిబాబు, కోఆర్డినేటర్‌ విజయలక్ష్మి, ప్రిన్సిపాల్‌ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రానికి

స్థలం, భవన నిర్మాణం

మధిర: మండలంలోని మహదేవపురానికి చెందిన రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ పుతుంబాక సుభాష్‌ తన తల్లిదండ్రులు రామసీతమ్మ – పురుషోత్తం పేరిట ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలం వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఇవ్వడమే కాక ఆరోగ్య ఉపకేంద్ర భవనం తామే నిర్మించేలా సోమవారం భూమి పూజ చేశామని వెల్లడించారు. ‘పుతుంబాక రామసీతమ్మ పల్లె దవాఖానా’గా నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌, డాక్టర్‌ చావా భాస్కరరావు, డాక్టర్‌ వాసిరెడ్డి శివలింగ ప్రసాద్‌, పార్వతవర్ధిని, కర్నాటి రామారావు, మంతరావు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ అధికారులు

అప్రమత్తంగా ఉండాలి

వీసీలో ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

హన్మకొండ: ఈదురు గాలులు, భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గోదావరి పరీవాహక ప్రాంతాల విద్యుత్‌ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి సూచించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి సోమవారం ఆయన 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి పరిధిలో ఎప్పటికప్పుడు విద్యుత్‌ సరఫరాను పరిశీలిస్తూ అంతరాయం ఎదురైతే వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడినా, ట్రిపింగ్‌, బ్రేక్‌డౌన్లు వచ్చినా త్వరగా పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, పంట కోతలు జరుగుతున్నందున పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ సర్వీసుల మంజూరులో వేగం పెంచాలని, అవసరమైన చోట 63 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సీఎండీ ఆదేశించారు.

నవమితో

ఆర్టీసీకి ఆదాయం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో ఈ నెల 6, 7వ తేదీల్లో జరిగిన శ్రీ రామనవమి, పట్టాభిషేకం సందర్భంగా ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపింది. దీంతో భద్రాచలం డిపోకు సుమారు రూ.9.5 లక్షల ఆదాయం పెరిగింది. సాధారణంగా భద్రాచలం డిపో పరిధిలో రోజూ 92 సర్వీసులు నడుపుతుండగా, రూ.23 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా 5న అదనంగా మరో 26 సర్వీసులు తిప్పగా రూ.3 లక్షల మేర ఆదాయం పెరిగింది. 6న అదనంగా 30 సర్వీసులు నడపగా రూ.4.50 లక్షలు, 7వ తేదీన అదనంగా 16 సర్వీసులు నడపగా రూ.2 లక్షల వరకు ఆదాయం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.

సంఘాల నాయకులతో నేడు సమావేశం
1
1/1

సంఘాల నాయకులతో నేడు సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement