
ఈదురుగాలులతో అపారనష్టం
● పలుచోట్ల నేలవాలిన పంటలు ● మామిడికాయలు రాలడంతో రైతుల ఆందోళన
సత్తుపల్లి/వేంసూరు/కల్లూరు రూరల్: సత్తుపల్లి నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కువడంతో రైతులకు నష్టం ఎదురైంది. మంగళవారం సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఈదురుగాలుల ప్రభావంతో సత్తుపల్లి మండలం పాకలగూడెంలో సూరిశెట్టి రామారావుకు చెందిన నాలుగు ఎకరాల అరటితోట నేలవాలగా, రుద్రాక్షపల్లిలో ధరావత్ కృష్ణకు చెందిన 30ఎకరాల మామిడితోటలో కాయలు నేలరాలాయని వాపోయారు. గంగారంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవడంతో రైతులు తిరిగి ఆరబోశారు. ఇక వేంసూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. శంభునిగూడెంలో మూడెకరాల మొక్కజొన్న పంట పడిపోవడంతో మంగళవారం అధికారులు పరిశీలించారు. మొత్తంగా 120 ఎకరాల్లో వరి, 180 ఎకరాల్లో మామిడి, 220 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. అలాగే, కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో కూడా మామిడితోటల్లో కాయలు నేలరాలాయి. ఈ కాయలు దెబ్బతినడంతో అమ్మే పరిస్థితి లేక నష్టపోయినట్లేనని రైతులు ఆవేదన చెందుతున్నారు.