స్లాట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

స్లాట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

స్లాట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

స్లాట్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌

● ప్రతీ డాక్యుమెంట్‌కు తప్పనిసరి చేసిన ప్రభుత్వం ● పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలో మూడు కార్యాలయాలు ● ఈనెల 10 నుండి నూతన విధానం అమలు

ఖమ్మంమయూరిసెంటర్‌: స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ పారదర్శకంగా ఉండేలా చేస్తూనే త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా.. తొలుత 19 కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి నూతన విధానాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా అమలుచేయనున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు స్థానం దక్కింది.

మూకుమ్మడిగా చేయకుండా..

ప్రస్తుతం ఎవరు ముందు వస్తే వారు రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక దళారులు పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు తీసుకొచ్చి వరుసగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటుండడంతో మిగతా వారి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో స్లాట్‌ బుకింగ్‌ విధానం అమలుచేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 19 కార్యాలయాలను పైలట్‌గాఎంపిక చేయగా.. ఖమ్మం ఆర్‌ఓ(జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌) కార్యాలయం, కూసుమంచి, కొత్తగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి నూతన విధానం అమలు కానుంది. గతంలో స్లాట్‌ బుకింగ్‌ విధానం ఉన్నా.. పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సేల్‌, మార్ట్‌గేజ్‌ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ మినహా ఇతర డాక్యుమెంట్లకు స్లాట్‌ బుక్‌ చేసిన దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం ఇప్పుడు పారదర్శకత కోసం స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఈ విధానంతో ఒకేసారి 30–40 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేసే వీలు ఉండదని.. ఒక స్లాట్‌లో ఒకే డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని చెబుతున్నారు.

రోజుకు 48 డాక్యుమెంట్లు

కొత్త విధానంలో రిజిస్ట్రేషన్‌కు వచ్చే వారు ముందుగా సమయం నిర్ణయించుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది. ఆ సమయానికి కాస్త ముందు వస్తే 10 నుంచి 15 నిమిషాల్లో పని పూర్తిచేసుకుని వెళ్లిపోవచ్చు. రోజుకు 48 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్‌ చేసేలా ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 10–30నుండి మధ్యాహ్నం 1–30 గంటల వరకు 24, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5గంటల వరకు 24 డాక్యుమెంట్ల చొప్పున స్లాట్‌లు కేటాయిస్తారు. స్లాట్‌ బుక్‌ చేసుకోలేని అత్యవసరమైన వారికి సాయంత్రం 5నుండి 6 గంటల వరకు సమయం ఇస్తారు. కానీ ఈ సమయంలో ఐదు డాక్యుమెంట్ల కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీలు లేదు. ‘వాక్‌ ఇన్‌ రిజిస్ట్రేషన్‌’ పేరుతో వీటికి అనుమతి ఇవ్వనుండగా.. కార్యాలయానికి ఎవరు ముందు వస్తే వారికి అవకాశం కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement