
వానాకాలం వచ్చేలోపు మరమ్మతులు
● సాగునీటి కాల్వలు, చెరువుల ఆధునికీకరణపై దృష్టి ● రూ.10 కోట్ల పనులకు ప్రణాళిక
ఖమ్మంఅర్బన్: వచ్చే వానాకాలం సీజన్ నాటికి పంటలకు అవాంతరాలు లేకుండా సాగునీరు సరఫరా చేయడంపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరడం, సాగునీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యాన కాల్వలు, తూములు, కట్టలను బలపర్చడం తదితర పనులు చేపట్టేలా కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని పనులు గుర్తించగా, వాటికి అంచనాలు రూపొందించి టెండర్లు పూర్తిచేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే వచ్చే వానాకాలం సీజన్‌లో నీరు సాఫీగా ముందుకు సాగి రైతులకు ఇక్కట్లు ఉండవని భావిస్తున్నారు.
ఇదే అదును...
ఏటా ఆయకట్టు ఆధారంగా జలవనరుల శాఖ ద్వారా సుమారు రూ.10 కోట్ల విలువైన పనులను చేపడుతారు. పంట విరామం సమయమైన ఏప్రిల్ నుంచి జూలై వరకు పనులు పూర్తిచేసేలా ప్రణాళిక ఉంటుంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో సాగర్ ప్రధాన కాల్వ, మేజర్లు, మైనర్లతో పాటు, చెరువులు, కుంటల పరిధి, ఎత్తిపోతల పథకాల పరిధిలో ఈసారి కూడా అవాంతరాలు ఉన్న చోట్ల సరిదిద్దేలా పనులు చేపడతారు. అయితే, ఈ పనులకు నిర్దేశించిన నిధుల లక్ష్యం దాటితే రాష్ట్ర కమిటీ ద్వారా అదనంగా మంజూరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరౖకైతే జిల్లాలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేలా గుర్తించినట్లు తెలిసింది. సీఈ ద్వారా రూ.5కోట్లు, ఇద్దరు ఎస్‌ఈల ద్వారా రూ.కోటి చొప్పున, ఆరుగురు ఈఈల పరిధిలో రూ.25 లక్షల చొప్పున పనులు చేయించడమే కాక మిగతా నిధులను 21మంది డీఈల పరిధిలో వెచ్చిస్తారు.
ఏమేం పనులు...
సాగర్ కాల్వల పరిధిలో కట్టడాల మరమ్మతులు, యూటీలు, ఓటీలు, క్రాస్ రెగ్యులేటర్ల మరమ్మతులు చేయనున్నారు. అలాగే, కాల్వలు, చెరువుల షట్టర్ల మరమ్మతు, కట్టలపై కంపచెట్లు తొలగింపు, పూడికతీత, కట్టలు బలపర్చే పనులు కూడా జాబితాలో ఉన్నాయి. ఇక చెరువుల పరిధిలో పూడికతీత చేపట్టి రైతులు తమ పొలాలకు ఒండ్రుమట్టి తరలింపునకు అనుమతి ఇస్తారు. ఇవేకాక ఎత్తిపోతల పథకాల వద్ద కూడా అవసరమైన మరమ్మతులను గుర్తించి పనులు చేపడుతారు.
టెండర్లు కొనసాగుతున్నాయి..
సాగర్ ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది.
కాల్వలు, చెరువులు, ఎత్తిపోతల పథకాలకు
సంబంధించి ఇప్పటికే సమస్యలు గుర్తించిన చోట మరమ్మతులకు సిద్ధమవుతున్నాం. కొన్ని పనులకు టెండర్ల పక్రియ కొనసాగుతోంది. పనులన్నీ
వర్షాకాలం మొదలయ్యేలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నాం.
– ఎం.వెంకటేశ్వర్లు, జలవనరులశాఖ ఎస్‌ఈ