
ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఇంకొకటి..
● ఖమ్మం ఎన్నెస్పీ క్యాంప్‌లో ఏర్పాటుకు నిర్ణయం ● స్థలాన్వేషణలో నిమగ్నమైన అధికారులు ● త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్న పోలీస్‌శాఖ
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుండగా ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు భారంగా మారుతోంది. దీంతో ఖమ్మంలో మరో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు సుముఖత వ్యక్తం చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ త్వరలోనే అనుమతులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఒక్క స్టేషన్‌తో ఇక్కట్లు
ఖమ్మంలోని కిన్నెర పాయింట్ వద్ద 25 ఏళ్ల కిందట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించారు. అయితే అప్పట్లో ఉన్న వాహనాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు పది రెట్లు పెరిగింది. దీంతో సరిపడా సిబ్బంది లేక ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తోడు వీఐపీల రాకపోకల సమయాన మరింత సమస్య ఎదురవుతోంది.
ఎన్నెస్పీ క్యాంప్‌లో మేలు..
జిల్లా అధికారుల ప్రతిపాదన మేరకు రాష్ట్ర పోలీసు శాఖలో రెండో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తుగా అధికారులు ఎన్నెస్పీ క్యాంప్‌లో పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు స్థలాన్వేషణపై దృష్టి సారించారు. సుమారు 500 గజాల నుంచి వెయ్యి గజాల స్థలం కావాల్సి ఉండడంతో గుర్తించగానే ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించనున్నారు. అలాగే, స్టేషన్ భవన నిర్మాణానికి హౌసింగ్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే, భవన నిర్మాణం జరిగే వరకు అద్దె భవనంలో ట్రాఫిక్ స్టేషన్–2ను ప్రారంభించే అవకాశముంది.
నగరమంతా సెక్టార్లుగా విభజన
కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరైతే నగరాన్ని సెక్టార్లుగా విభజించనున్నారు. తద్వారా ట్రాఫిక్ స్టేషన్–1 పరిధిలోకి వన్‌టౌన్, త్రీటౌన్‌తో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వరకు వస్తుందని తెలిసింది. అలాగే, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్–2 కిందకు టూటౌన్, ఖానాపురం హవేలీతో పాటు అన్ని శివారు ప్రాంతాలకు తీసుకొస్తారని సమాచారం. ప్రస్తుత ట్రాఫిక్ స్టేషన్‌లో 100 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా.. కొత్త స్టేషన్‌కు సైతం అదేస్థాయిలో సిబ్బందిని కేటాయించే అవకాశముంది. ఇక ఏసీపీ స్థాయి అధికారి రెండు స్టేషన్‌లకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు.
స్థలాన్ని పరిశీలిస్తున్నాం..
పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ నేతృత్వాన పంపించిన ప్రతిపాదనలకు సుముఖత వ్యక్తమైంది. దీంతో ఎప్పుడైనా ఉత్తర్వులు వచ్చే అవకాశముండడంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం ఎన్నెస్పీలో అనువైన స్థలాలను పరిశీలిస్తుండగా త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. రెండో ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటైతే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సులువవుతుంది. –శ్రీనివాసులు, ట్రాఫిక్ ఏసీపీ