
రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వే పోలీస్ స్టేషన్ సమీపాన బుధవారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు (65) మృతి చెందాడని జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాపర్తినగర్ రైల్వే బ్రిడ్జి సమీపాన ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు వివరించారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మంలీగల్: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం విజయనగర్‌కాలనీకి చెందిన మురళికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప గురువారం తీర్పు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పూసా నరేందర్ వద్ద మురళి 2013 డిసెంబర్‌లో రూ.7 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ నగదు చెల్లించే క్రమాన 2015 ఫిబ్రవరిలో చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో నగదు లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. దీంతో నరేందర్ లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. ఈ మేరకు విచారణ అనంతరం మురళికి ఆరు నెలల శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7 లక్షలు చెల్లంచాలని న్యాయమూర్తి తీర్పుచెప్పారు.
పాముకాటుతో వలస కూలీ మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెంలో వలస కూలీని పాము కాటు వేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిసింగ్ – అదిషో దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి రాగా, మండల కేంద్రంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి అదిషో (32) మూత్రవిసర్జన కోసం బయటకు వెళ్లివచ్చాక కాలిపై ఏదో కుట్టినట్లు అనిపించిందని భర్తకు చెబుతూ నిద్రించింది. బుధవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా గురువారం ఉదయం మృతి చెందింది. కాగా, ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు చేయూతతో బల్లేపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మరణంలోనూ అన్నదమ్ముల బంధం
నేలకొండపల్లి: చిన్నతనం నుంచి కలిసిమెలిసి జీవించిన ఆ అన్నదమ్ముళ్లు ఒకే రోజు మృతి చెందడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురానికి చెందిన షేక్ జానీమియా (90), మదార్‌సాహెబ్ (85) సోదరులు. వీరిద్దరు కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా, గురువారం గంటల వ్యవధిలో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకోగా, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, గ్రామంలో కబరస్తాన్ సమస్యతో పాటు ఇతర కారణాలతో మదార్‌సాహెబ్ అంత్యక్రియలు బోదులబండలో, జానీమియా అంత్యక్రియలు చెరువుమాధారంలో పూర్తిచేశారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి

రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతి