
20న జిల్లాస్థాయి చెస్ టోర్నీ
ఖమ్మంస్పోర్ట్స్: ఈ నెల 20న జిల్లాస్థాయి చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఖమ్మంలోని సర్వజ్ఞ స్కూల్‌లో అండర్–10, 13, 16 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు ఉంటాయని వెల్లడించారు. స్విస్ లీగ్ పద్ధతిలో జరిగే పోటీలకు హాజరుకావాలనుకునే వారు ఆర్గనైజర్ సీహెచ్.గోపి (94401 62749)ని సంప్రదించాలని సూచించారు.
జాబ్‌మేళాలో
17 మంది ఎంపిక
ఖమ్మంరాపర్తినగర్: రిలయన్స్ నిప్పాన్ కంపెనీలో ఉద్యోగాలకు గురువారం ఖమ్మంలో నిర్వహించిన జాబ్‌మేళాకు 48 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం వీరిలో 17 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు.
ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో నలుగురికి స్థానం
ఖమ్మం మయూరిసెంటర్/పాల్వంచ/చింతకాని: అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎంఎస్) జాతీయ సమితిలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి స్థానం లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో గురువారం ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అలాగే, భద్రాద్రి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం, చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్‌లో సభ్యులుగా స్థానం దక్కింది. నేలకొండపల్లి మండలం ముటాపురానికి చెందని హేమంతరావు ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేయడంతో ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, గోవిందరావు 1991లో సీపీఐలో కొనసాగుతుండగా వివిధ హోదాల్లో పనిచేయడమే కాక రాఘవాపురం సర్పంచ్‌గా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈమేరకు వీరిని పలువురు అభినందించారు.
అందుబాటులో
తపాలా బీమా పథకాలు
కూసుమంచి: పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి కోరారు. మండలంలోని రాజుపేటకు చెందిన భూక్యా చిరంజీవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన బీమా చేయించి ఉన్న నేపథ్యాన రూ.10 లక్షల పరిహారం మంజూరైంది. ఈ మేరకు చిరంజీవి కుటుంబానికి బీమా చెక్కు అందజేశాక సూపరింటెండెంట్ మాట్లాడారు. పోస్టల్ శాఖ ద్వారా ఏటా రూ.520 ప్రీమియంతో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షల బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోస్టల్ శాఖ ఖమ్మం డివిజన్ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మేనేజర్ రాజేశ్, మాజీ సర్పంచ్ కందాల సురేందర్‌రెడ్డితో పాటు జగదీశ్, పెరుగు నాగేశ్వరరావు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ తనిఖీ
ముదిగొండ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ గురువారం తనిఖీ చేశారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అందిన దరఖాస్తులు, వాటి పరిశీలనపై ఎంపీడీఓ శ్రీధర్‌స్వామితో సమీక్షించారు. ఏ యూనిట్ కోసం దరఖాస్తు అందిందో నమోదు చేయాలని, రెండింటి కోసం దరఖాస్తు చేస్తే ‘డబుల్’అని రాయాలని సూచించారు. అలాగే, భూభారతి చట్టంపై నిర్వహించే అవగాహన సదస్సు ఏర్పాట్లపై తహసీల్దార్ సునీత ఎలిజబెత్‌తో చర్చించారు.

20న జిల్లాస్థాయి చెస్ టోర్నీ