
అంతా సవ్యంగానే ఉందా?!
● పాఠశాలల స్థితిగతులపై ఏటా యు–డైస్ సర్వే ● ఇందులో వివరాలపై థర్డ్ పార్టీ ద్వారా పరిశీలన
ఖమ్మంసహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన ఎలా జరుగుతోంది.. ఇంకా ఏమేం వసతులు కావాలనే సమాచార సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఏటా యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యు–డైస్) సర్వే చేయిస్తోంది. ప్రతీ అక్టోబర్, నవంబర్‌లో సర్వే చేస్తుండగా.. ఇందులో నమోదైన వివరాలను సరిచూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీ సర్వేకు నిర్ణయించింది. డైట్ కళాశాల విద్యార్థులతో చేయిస్తున్న ఈ సర్వే 15వ తేదీన మొదలుకాగా 21వ తేదీతో ముగియనుంది. ఉమ్మడి జిల్లాలో డైట్ కళాశాల ఒకటే ఉన్నందున భద్రాచలం ఐటీడీఏలోని బీఈడీ కళాశాల విద్యార్థులను కూడా సర్వేకు వినియోగించుకుంటున్నారు.
యు–డైస్ సర్వే ఇలా..
ఏటా కేంద్రం యు–డైస్ సర్వే నిర్వహిస్తుంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాల ఆధారంగా సదుపాయల కల్పనకు కేంద్రం నిధులు విడుదల చేస్తుంది.
కొన్ని తేడాలు..
యు–డైస్ సర్వే ద్వారా పలు స్కూళ్లలో సరైన వసతులు లేవని తేల్చారు. టాయిలెట్లు, డిజిటల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం లేవని గుర్తించారు. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా వివరాలు ఇలా నమోదైనందున థర్డ్ పార్టీ సర్వేకు నిర్ణయించినట్లు తెలిసింది.
డైట్ విద్యార్థులతో..
జిల్లాలో డైట్ విద్యార్థులతో థర్డ్ పార్టీ సర్వే కొనసాగుతుండగా, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఎంపిక చేసిన పాఠశాలలకు విద్యార్థులు వెళ్లి అక్కడ ఉన్న వసతులను నమోదు చేస్తున్నారు. యు–డైస్‌లో ఏం నమోదు చేశారు.. వాస్తవ పరిస్థితులు ఏమిటో పరిశీలించి తేడాను నివేదికలో పొందుపరుస్తున్నారు. ఖమ్మం సమీపాన ఓ పాఠశాలలో ర్యాంప్ లేకున్నా ఉన్నట్లు నమోదు చేశారని, మరుగుదొడ్లు ఉన్నా లేనట్లుగా పేర్కొన్నారని గుర్తించినట్లు సమాచారం. అలాగే, చిన్న మరమ్మతులు అవసరమైతే భవనాలు శిథిలావస్థకు చేరాయని యు–డైస్ సర్వేలో పొందుపర్చారని తేల్చినట్లు తెలిసింది. ఈనెల 21వ తేదీ వరకు కొనసాగే థర్డ్ పార్టీ సర్వేతో వాస్తవ పరిస్థితులు వెలుగుచూస్తాయని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది.
జిల్లా పాఠశాలలు సర్వే చేస్తున్న విద్యార్థులు
ఖమ్మం 1,170 80 మంది
భద్రాద్రి కొత్తగూడెం 530 72 మంది
సదుపాయాల కల్పనకు దోహదం
యు–డైస్ సర్వేలోని అంశాలను పునఃపరిశీలన ద్వారా పాఠశాలల్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన తప్పులను సరిచేయడమే కాక భవిష్యత్‌లో చేయాల్సిన పనులకు మార్గం ఏర్పడుతుంది. రోజువారీగా సర్వేను నిశితంగా పరిశీలిస్తున్నాం.
– సామినేని సత్యనారాయణ, డైట్ ప్రిన్సిపాల్

అంతా సవ్యంగానే ఉందా?!