
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
● అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం ● రూ.72.33 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన ● వైరా నదిపై ఎత్తిపోతల పథకం ప్రారంభం
మధిర: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, పనులు నాణ్యతగా ఉండేలా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ.72.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. తొలుత సిరిపురం గ్రామానికి చేరుకున్న భట్టికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గ్రామస్తులు, పార్టీ శ్రేణులను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలు అడుగుతూ ముందుకు సాగిన ఆయన.. రూ.4.71కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో రూ.5 కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన సముదాయానికి, రూ.11.37 కోట్లతో నిర్మించే ఐటీఐ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మహదేవపురం వద్ద వైరా నదిపై రూ.12.13 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం రాయపట్నంలో వైరా రివర్ కుడి కాల్వపై రూ.19.06 కోట్లతో 1,079 ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర నుంచి మొలుగుమాడు ద్వారా నిధానపురం గ్రామం వరకు రూ.25 కోట్లతో విస్తరిస్తున్న ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మధిర క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. శంకుస్థాపన చేసిన పనులన్నీ నిర్దిష్ట గడువులోగా పూర్తి చేసేలా క్యాలెండర్ ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ సీఈ ఓ.వి. రమేష్ బాబు, కల్లూరు సర్కిల్ ఎస్‌ఈ జి.వాసంతి, మధిర డివిజన్ ఈఈ సీహెచ్. రామకృష్ణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, డీఈఈ వి.నాగబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.