
రజతోత్సవ సభకు తరలిరావాలి
ఖమ్మంమయూరిసెంటర్ : తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని చాటి చెప్పేందుకు ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మం బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ ఉమ్మడి జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. పార్టీ రజతోత్సవ సభల జయప్రదానికి ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ శ్రేణుల తరలింపుపై దిశా నిర్దేశం చేశారు. సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు, తాగునీరు, భోజనాల సరఫరాతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం తదితర అంశాలపై చర్చించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 27న ఉదయం ఉమ్మడి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లోని పార్టీ దిమ్మెలను ముస్తాబు చేయాలని, లేని చోట నిర్మించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఎల్కతుర్తి సభను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియ, బానోత్ మదన్‌లాల్, బానోతు చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ముత్యాల వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ తాతా, వద్దిరాజు, పువ్వాడ