
భూసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● అందుకోసమే అమల్లోకి భూ భారతి చట్టం ● ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
ఖమ్మంరూరల్: గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌సైట్ ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభించకపోగా, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలి పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కరించేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త చిక్కులు ఎదురయ్యాయన్నారు. ఈనేపథ్యాన సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిపుణులతో చర్చించి భూ భారతి చట్టానికి రూపకల్పన చేశారని తెలిపారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ మ్యుటేషన్, ఇనాం భూములు, భూ టైటిళ్లకు సంబంధించి ఫిర్యాదులు ఉంటే రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీఓ నరసింహారావు, డీఏఓ పుల్లయ్య, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీఓ కుమార్, ఏడీఏ సరిత తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రికి అభివృద్ధికి సహకారం
ఖమ్మంవైద్యవిభాగం: పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్న ఖమ్మం జనరల్ ఆస్పత్రి అభివృద్ధి, సౌకర్యాల కల్పనకు సహకరిస్తానని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి ఎంపీ లాడ్స్ నిధులు రూ.8లక్షలతో కేటాయించిన ఎనిమిది ఫ్రీజర్లను అందించడంతో పాటు వైద్యాధికారుల విజ్ఞప్తితో రెండు బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ పాత భవనం మరమ్మతుల కోసం నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, డాక్టర్ బాబు రత్నాకర్, డాక్టర్ బి.కిరణ్, నందగిరి శ్రీనుతో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు తుంబూరు దయాకర్‌రెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, లింగాల రవికుమార్, మియా భాయ్, కాంపాటి వెంకన్న, మజీద్, ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ పాల్గొన్నారు.
హైవేల నిర్మాణంలో వేగం
ఖమ్మంవన్‌టౌన్: పీఎంజీఎస్‌వై, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపడుతున్న జాతీయ రహదారులు, వంతెనల నిర్మాణంలో వేగం పెంచాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులతో సమావేశమై రహదారుల నిర్మాణ పురోగతిపై ఆరా తీశాక సర్వీస్ రోడ్లు, ఇతర అంశాలపై సూచనలు చేశారు. పీఆర్ ఈఈ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ బ్రిడ్జి నుంచి కోదాడ మార్గంలో ధంసలాపురం వరకు, అగ్రహారం రైల్వే వంతెన నిర్మాణ ప్రాంతంలో ఎన్‌హెచ్‌ఏఐ పీడీ దివ్యతో కలిసి ఎంపీ పరిశీలించారు. మద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాధ్‌బాబు, నాయకులు కల్లెం వెంకటరెడ్డి, కొప్పుల చంద్రశేఖర్, బ్రహ్మారెడ్డి, తమ్మినేని నవీన్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.