
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
ఖమ్మంసహకారనగర్: పేదల సొంతింటి కల నిజం చేసేలా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో లబ్ధిధారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన సీఎస్ శాంతికుమారి తదితరులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఖమ్మం నుంచి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, భూ భారతి అవగాహన సదస్సులపై సూచనలు చేశారు. జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి సదస్సుల్లో ఇప్పటివరకు 1079 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్, హౌసింగ్ పీడీ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన
ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే
ఖమ్మంమయూరిసెంటర్: కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం కలెక్టరేట్‌లో కలిశారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడమే కాక సత్తుపల్లి నియోజకవర్గం ఇందిరమ్మ లబ్ధిదారులు జాబితాలో గృహలక్ష్మి లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 1638 సన్నరకం ధాన్యాన్ని కూడా సేకరించాలని కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు కనగాల వెంకటరావు, మోహన్‌రావు, అశోక్, మల్లిదు వెంకన్న, ఆసిఫ్, పాషా పాల్గొన్నారు.
25న సకల ఉద్యోగుల ర్యాలీ, సదస్సు
ఖమ్మంసహకారనగర్: తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యాన ఈనెల 25నసాయంత్రం ఖమ్మం కలెక్టరేట్ నుండి టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు కరపత్రాలు, పోస్టర్లను యూటీఎఫ్ భవన్‌లో మంగళవారం ఆవిష్కరించాక మాట్లాడారు. ర్యాలీ అనంతరం టీఎన్జీవోస్ భవన్‌లో సదస్సు ఉంటుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, వెంకన్న, రాంబాబు, ఉద్దండ్ షరీఫ్, సురేష్, నాగేశ్వరరావు, కేశ్యా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ట్రయల్ రన్ కోసం పాలేరు నీటి విడుదల
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వ ద్వారా మంగళవారం సాయంత్రం నీరు విడుదల చేశారు. పంటల సీజన్ ముగియగా కొద్దిరోజుల క్రితం నీటి సరఫరా పూర్తిగా నిలిపేశారు. అయితే, రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం ట్రయల్‌రన్ కోసం తిరిగి నీటిని విడుదల చేశారు. వేయి క్యూసెక్కుల నీటిని 24 గంటల పాటు విడుదల చేశాక నిలిపివేస్తామని అఽధికారులు తెలిపారు.
బంక్‌ల్లో కనీస సౌకర్యాలు తప్పనిసరి
నేలకొండపల్లి: పెట్రోల్ బంక్‌ల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించకపోతే నిర్వాహకులకు చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ తెలిపారు. మండలంలోని తిరుమలాపురంలో పెట్రోల్ బంక్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించాక మాట్లాడారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను బాక్స్‌ల్లో వేయాలని తెలిపారు. అనంతరం పలు గ్రామాల్లో రైస్ మిల్లులను తనిఖీ చేసిన డీఎస్‌ఓ.. రైతులతో మాట్లాడారు. సివిల్ సప్లయీస్ ఆర్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
యూడీఐడీకి 72మంది దివ్యాంగుల అర్హత
ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగులకు యూనిక్ డిసేబులిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ)లు జారీ చేసేందుకు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం శిబిరం నిర్వహించారు. స్లాట్ బుక్ చేసుకున్న 253మందిలో 149మంది హాజ రుకాగా, పరీక్షల అనంతరం 72మంది దివ్యాంగులను కార్డులకు అర్హులుగా నిర్ధారించారు.
స్తంభం పడి మేకలు మృతి
కొణిజర్ల: కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభం విరిగిపడడంతో రెండు మేకలు మృతి చెందాయి. మండలంలోని పల్లిపాడుకు చెందిన రాయల రుక్మిణి, ఆమె కుమారుడు కలిసి మేకలు మేపుతున్నారు. అదే ప్రాంతంలో 33 కేవీ లైన్ ఏర్పాటులో భాగంగా వేస్తున్న స్తంభాలు ఒకటి కూలి రెండు మేకలపై పడడంతో మృతి చెందాయి. ఘటనపై రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.