
రేపటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఐదో మహాసభలు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తెలిపారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఖమ్మం సుందరయ్య భవనంలో బుధవారం ఆయన మాట్లాడుతూ 2002 తర్వాత ఖమ్మంలో రాష్ట్ర మహాసభలు జరుగుతుండగా, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర మహాసభల్లో 33 జిల్లాలు, పదహారు యూనివర్సిటీల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. తొలిరోజైన శుక్రవారం ఉదయం వేలాది మందితో ర్యాలీ నిర్వహించాక భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు వీ.పీ.సాను, సినీ నటుడు మాదాల రవి, ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి పాల్గొంటారన్నారు. విద్యార్థులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, టి.ప్రవీణ్, నాయకులు దొంతబోయిన వెంకటేష్, వినోద్, లోకేష్, త్రినాథ్, సుశాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.