
జిగేల్‌మనేలా విద్యుత్ వెలుగులు
సబ్‌స్టేషన్ల ఇంటర్ లింకింగ్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు
● చకచకా కొత్త సబ్‌స్టేషన్లు, కార్యాలయాల నిర్మాణం ● విద్యుత్ శాఖ మంత్రిగా భట్టి ఉండడంతో ప్రతిపాదనలకు మోక్షం
మధిర: జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలాచోట్ల చిన్నపాటి వర్షం కురిసినా, గాలిదుమారం మొదలైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ఇలాంటి పరిస్థితి ఎదురైనా సిబ్బంది వెళ్లి మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించడానికి సమయం పట్టేది. ఇంకొన్ని చోట్ల లోఓల్టేజీ సమస్య వేధించేది. ఉద్యోగుల కొరత, సరిపడా పరికరాలు లేకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు చాలా మార్పులు జరిగాయి. సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, రెండేసి సబ్‌స్టేషన్ల నడుమ ప్రత్యామ్నాయ లైన్లు వేయడంతో పాటు సిబ్బందికి కావాల్సిన పరికరాలు, వాహనాలను సమకూర్చడంతో మరమ్మతుల్లో వేగం పెరిగింది. జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగానే కాక విద్యుత్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తుండడంతో కావాల్సిన నిధులు, కొత్త సబ్‌స్టేషన్లు, కార్యాలయాలకు భవనాలపై ప్రతిపాదనలు వెళ్లిన వెంటనే మంజూరవుతుండడంతో పనుల్లోనూ వేగం పెరిగింది.
నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు
ఎర్రుపాలెం మండలంలోని పెద్ద గోపవరం రెవెన్యూ పరిధిలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అలాగే, మధిర మండలం మాటూరులో నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. ఇంకా రాయపట్నం, రేమిడిచర్ల, వైరా టౌన్, రెబ్బవరం, బ్రాహ్మణపల్లి, లక్ష్మీపురం, చిరునోములల్లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.21 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా త్వరలోనే మంజూరయ్యే అవకాశముంది.
లోడ్ ఆధారంగా..
వైరా డివిజన్‌లో వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలు.. మధిర టౌన్, మధిర రూరల్, ఎర్రుపాలెం, మామునూరు, బోనకల్, వైరా టౌన్, వైరా రూరల్ సెక్షన్లు ఉన్నాయి. ఈ డివిజన్‌లో రూ.5.50 కోట్లతో 238 నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తుండగా.. మధిర, వైరా మండల కేంద్రాల్లో రూ.65 లక్షలతో విద్యుత్ ఫీడర్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల మధ్య నమోదయ్యే విద్యుత్ లోడును పరిగణనలోకి తీసుకుని ఓవర్ లోడ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తుండడంతో అంతరాయాలు ఎదురుకావని చెబుతున్నారు.
సబ్ స్టేషన్ల అనుసంధానం
ఏదైనా ఒక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించేంత వరకు ఇబ్బందులు ఉండేది. కానీ రూ.3.66కోట్ల నిధులతో చేపట్టిన ఇంటర్ లింకింగ్ లైన్లతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఖమ్మం సమీపాన పెద్దగోపతి 220 కేవీ సబ్‌స్టేషన్ నుంచి బోనకల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, బోనకల్ నుంచి సిరిపురానికి, అక్కడ నుంచి మధిర 132 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ సబ్ స్టేషన్లలో రూ.1.90కోట్లతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. తద్వారా మధిర సబ్‌స్టేషన్ నుంచి బోనకల్ ఫీడర్‌కు సరఫరాలో అంతరాయం ఏర్పడితే పెద్దగోపతి సబ్‌స్టేషన్ నుంచి జానకీపురం.. ఆపై బోనకల్ సరఫరా చేసే వీలు కలుగుతోంది. కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధిరతో పాటు జిల్లాలోని సమస్యలపై అవగాహన ఉండడంతో ట్రాన్స్‌ఫార్మర్లు, అవసరమైన చోట్ల స్తంభాల ఏర్పాటు, ప్రమాదకరంగా ఉన్న తీగల తొలగింపు పనులకు నిధులు కేటాయిస్తుండడంతో అధికారులు ప్రత్యేక దృష్టితో పనులు చేపడుతున్నారు.
భవన నిర్మాణాలు
మధిరలో విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయం 1991లో ఏర్పాటైంది. అప్పటినుంచి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, రెవెన్యూ కార్యాలయాలు ఇరిగేషన్ శాఖకు సంబంధించి రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. వర్షం వస్తే లోపలకు నీళ్లు చేరి ఫైళ్ళు తడిచిపోతున్నాయి. ఈమేరకు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో కార్యాలయ నిర్మాణానికి రూ.45 లక్షలు మంజూరు కాగా పనులు జరుగుతున్నాయి. అలాగే, వైరా డివిజన్, రెవెన్యూ కార్యాలయాల భవన నిర్మాణానికి సైతం రూ.70 లక్షలు మంజూరయ్యాయి.

జిగేల్‌మనేలా విద్యుత్ వెలుగులు