
కొనుగోళ్లకు కొర్రీలు
పెరిగిన ఖర్చులు..
సన్నధాన్యం పండిస్తే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలోనూ పలువురు రైతులు ఆ ధాన్యాన్నే సాగు చేశారు. అయితే చివరిలో వచ్చిన అకాల వర్షాలు వారిని దెబ్బతీశాయి. మొదట పంట బాగానే ఉన్నా.. కోత దశలో వచ్చిన వర్షం నష్టాన్ని చేకూర్చింది. ధాన్యాన్ని టైర్ల మిషన్‌తో కోస్తే ఎకరానికి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఖర్చవుతుంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలతో టైర్ మిషన్లతో కోయడం కష్టంగా మారడంతో ట్రాక్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. దీంతో ఎకరానికి రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చయింది. దీనికి తోడు కొన్ని కేంద్రాల్లో ధాన్యంపై కప్పుకోవడానికి టార్పాలిన్లు కూడా రైతులే కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా రైతులపై అదనపు భారం పడింది.
అమ్ముదామంటే అవస్థలు..
జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలు తెరవగా.. 184 కేంద్రాల్లో కొద్దో గొప్పో కొనుగోళ్లు సాగుతున్నాయి. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. క్వింటాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీయకపోతే దిగుమతి చేసుకోమంటూ మిల్లర్లు చెబుతున్నారు. ధాన్యం తేమశాతం నిబంధనలకు లోబడే ఉందని, ఇతర ఖర్చులు కూడా తామే భరిస్తున్నామని, మళ్లీ తరుగు ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. తరుగు తీసేందుకు ససేమిరా అంటున్నారు. ఇక లోడింగ్‌కు లారీలు రాకపోవడంతో ధాన్యం కాంటా వేసేందుకు నిర్వాహకులు ఒప్పుకోవడం లేదు. వెంటనే లోడింగ్, అన్‌లోడ్ అయితేనే లారీలు పెడతామని సరఫ రాదారులు చెబుతున్నారు. తరుగు తీయకపోవడంతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు.
తడుస్తున్న ధాన్యం..
రోజుల తరబడి కేంద్రాల్లో ధాన్యం ఆరబోసి ఉండగా.. ఇటీవల పలుమార్లు అకాల వర్షం కురిసింది. టార్పాలిన్లు వేసినా.. కింద నుంచి నీరు రావడం, కొన్ని కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసింది. దీంతో చాలామంది రైతులు మళ్లీ కూలీలను పెట్టి తిరగేయించారు. ఇలా తడవడం, తూర్పార పట్టించడం, ఆరబోయడంతోనే సరిపోతుండగా మారుతున్న వాతావరణంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు ఉండడం లేదు. కనీసం రైతులకు తాగునీరు కూడా అందుబాటులో లేదు.
ప్రభుత్వ కేంద్రాల్లోనే
రైతుల పడిగాపులు
క్వింటాకు 5 కేజీల
తరుగు తీస్తామంటున్న మిల్లర్లు
లారీలు లేకుండా కాంటా
వేయలేమంటున్న నిర్వాహకులు
అకాల వర్షాలతో తడిసిన ధాన్యం
ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఆశతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామని వచ్చిన రైతులకు పడిగాపులు తప్పడం లేదు. క్వింటాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీస్తామని మిల్లర్లు, లారీలు వస్తేనే కాంటాలు వేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లోడింగ్, అన్‌లోడింగ్ వెంటనే చేస్తేనే లారీలు పెడతామంటూ సరఫరాదారులు, క్వింటాకు రూ.65 ఇవ్వాలని హమాలీలు పెడుతున్న కొర్రీలతో అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్టు అకాల వర్షాలతో కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది. దీంతో కొందరు రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు ముందుకొస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
కేంద్రాల వద్ద పడిగాపులు..
రైతులు గత 10, 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విపరీతమైన ఎండలతో అలసిపోతున్నారు. ఉక్కపోతతో తట్టుకోలేకపోతున్నామని, కాంటాలు వేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇక హమాలీలకు క్వింటాకు రూ.65 ముట్టజెప్పాల్సి వస్తోందని, తూర్పార పడితే రూ.200 వరకు ఖర్చవుతోందని చెబుతున్నారు. కొందరు రైతులు వేచి ఉండలేక ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే వారు క్వింటా రూ.2,100కే అడుగుతున్నా.. ఇతర ఖర్చులు, ఇబ్బందులు ఉండవనే కారణంతో వారికే అమ్ముతున్నామని
చెబుతున్నారు.
వివరాలు..
జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు 351
కొనుగోళ్లు సాగుతున్నవి 184
కొనుగోలు చేసిన ధాన్యం 29,695.200
మెట్రిక్ టన్నులు
ధాన్యం విక్రయించిన రైతులు 3,578
మిల్లులకు తరలించిన ధాన్యం 29,695.200
మెట్రిక్ టన్నులు
ఏం చేయాలో అర్థం కావట్లే..
సన్నరకం ధాన్యం అమ్ముకునేందుకు ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వారం క్రితం తరలించా. తేమ 16 శాతం ఉంది. సన్నధాన్యం కావడంతో బోనస్ వస్తుందని తెచ్చా. ఇక్కడ టార్పాలిన్‌లు లేవు. వాతావరణం గంటకో తీరుగా మారుతోంది. ఎప్పుడు వర్షం వస్తుందోనని భయమేస్తోంది. కాంటాలు మాత్రం వేయడం లేదు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముదామంటే క్వింటా రూ.1500కే అడుగుతున్నారు.
– చిల్లపల్లి లక్ష్మణ, పెనుబల్లి
ధాన్యం కొనుగోలు చేయడం లేదు
నేను పదెకరాల్లో వరి సాగు చేశా. 500 బస్తాల దిగుబడి వచ్చింది. ధాన్యం అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే 12 రోజులైనా కొనుగోలు చేయలేదు. ఇప్పటికే వర్షంతో ధాన్యం ఒకసారి తడిస్తే కూలీలను పెట్టి తిరగేయించా. అడిగితే రేపు, మాపు అంటున్నారు. బోనస్ వస్తుందని కేంద్రానికి తీసుకొస్తే ఇలా ఇబ్బంది పెడుతున్నారు.
– కొప్పుల శ్రీనివాసరెడ్డి, బీరోలు,
తిరుమలాయపాలెం మండలం

కొనుగోళ్లకు కొర్రీలు

కొనుగోళ్లకు కొర్రీలు

కొనుగోళ్లకు కొర్రీలు