
లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు
20 జీపీల్లో తొలివిడతగా 853 గృహాల మంజూరు
● బేస్‌మెంట్ స్థాయి పూర్తవగానే మొదటి బిల్లు ● లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమ ● అవకతవకలు జరగకుండా ఏఐ టెక్నాలజీతో పరిశీలన
ఈ మహిళ పేరు బానోతు బుజ్జి. కూసుమంచి
మండలం ధర్మతండాకు
చెందిన ఈమె కుటుంబం ఇన్నాళ్లు చుట్టూ తడికలు కట్టుకుని రేకుల షెడ్‌లో
ఉంటోంది. తొలి విడతలో
ఇందిరమ్మ ఇల్లు మంజూరు
కావడంతో నిర్మాణం
బేస్‌మెంట్ వరకు చేపట్టారు. దీంతో రూ.లక్ష బిల్లు ఖాతాలో జమ అయింది. ‘మేం ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం అండగా
నిలవడంతో మా బాధలు
తీరనున్నాయి.’ అని బుజ్జి
ఆనందంగా వెల్లడించింది.
జియో ట్యాగ్ చేస్తూ..
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఏఐ సాయం తీసుకుంటోంది. జిల్లాలో తొలి విడతగా 854 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 320 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి చేరాయి. అయితే, పునాదుల దశలోనే 561 ఇళ్లకు జియో ట్యాగ్ చేసి యాప్‌లో ఫొటోలు పొందుపరిచారు. ఇంకా 41 దరఖాస్తులను ఎంపీడీఓలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది.
ఎల్–1లో 60,747 దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. సొంత స్థలం ఉండి గుడిసె, రేకులషెడ్, టైల్స్ వేసిన, అద్దె ఇళ్లలో ఉండేవారిని ఎల్–1(లిస్ట్)గా గుర్తించారు. గుడిసెలు, రేకులషెడ్లు, టైల్స్ వేసిన ఇళ్లు, అద్దె ఇళ్లలో ఉంటూ స్థలం కూడా లేని వారిని ఎల్–2 కేటగిరీగా, ఇళ్లు ఉండి.. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తమకు ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్న సంతానాన్ని ఎల్–3 కేటగిరీలో చేర్చారు. ఎల్–1 జాబితాలో 60,747 దరఖాస్తుల పునఃపరిశీలన కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అర్హుల జాబితాను కలెక్టర్‌కు పంపిస్తారు. ఆపై ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
అక్రమాలకు ఆస్కారం లేకుండా..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ ఆధారంగానే బేస్‌మెంట్ కట్టకుండానే కట్టినట్లు నమోదు చేయగా, భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో బిల్ కలెక్టర్‌ను సస్పెండ్ చేశారు. బిల్లు మంజూరుకు సిఫారసు చేసే సమయాన ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వం సూపర్ చెకింగ్ చేయిస్తోంది. సదరు ఇళ్లు బేస్‌మెంట్ లెవెల్ ఫొటోను గృహ నిర్మాణ శాఖ యాప్‌లో పొందుపరిస్తే పరిశీలించాక బిల్లు మంజూరుచేస్తారు. దీంతో సంబంధిత యంత్రాంగం, ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న ఇతర శాఖల అధికారులు సైతం అవకతవకలు జరగకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మండలానికి ఓ గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి తొలి విడతగా ఇరవై గ్రామపంచాయతీల్లో 853 మందికి ఇళ్లు మంజూరుచేశారు. ఇందులో బేస్‌మెంట్ స్థాయికి నిర్మాణం పూర్తిచేసిన వారి ఖాతాల్లో రూ.లక్ష చొప్పున మొదటి బిల్లు జమ చేస్తున్నారు. పైలట్ గ్రామాల్లో నిర్మాణం వేగంగా జరుగుతుండగా.. మిగతా గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. సర్వే అనంతరం రెండో విడత అర్హుల జాబితా విడుదల చేస్తారు.
– సాక్షిప్రతినిధి, ఖమ్మం
బేస్‌మెంట్ పూర్తయితే రూ.లక్ష
బేస్‌మెంట్ స్థాయికి చేరిన ఇళ్లకు రూ.లక్ష బిల్లు ఇచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. ఆపై లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఒక్కో గ్రామంలో గెజిటెడ్ అధికారి 200 వరకు దరఖాస్తులను పరిశీలిస్తూ, అర్హులు ఎవరెవరో గుర్తిస్తున్నారు.
– భూక్యా శ్రీనివాస్, పీడీ, హౌసింగ్

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు

లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు