గుడ్డు ధరలు పెంపు
● ‘మధ్యాహ్న’ ఏజెన్సీ మహిళలకు ఊరట ● సర్కారు పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం ● రూ.5నుంచి రూ.6కు పెంచుతూ ఉత్తర్వులు జారీ
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తోంది. ఇటీవల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ధరాభారం తాము మోయలేమంటూ మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొన్ని పాఠశాలల్లో వారంలో గుడ్డుకు బదులు అరటిపండు ఇస్తుండగా.. ఇంకొందరు వారంలో ఒక గుడ్డుతో సరిపెడుతున్నారు. కోడిగుడ్డు కొనుగోలు అంటేనే వంట ఏజెన్సీ మహిళలు తమవైపు గుర్రుగా చూస్తున్నారని టీచర్లు వాపోయిన సందర్భాలు లేకపోలేదు. మార్కెట్‌లో గుడ్డు ధరలకు ప్రభుత్వం చెల్లించే ధరల్లో వ్యత్యాసం ఉండడంతో ఏజెన్సీలకు అదనపు భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుడ్డు ధరను ఒక రూపాయి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. కోడిగుడ్డు ధర రూ.5నుంచి రూ.6 వరకు పెంచింది. దీంతో ఏజెన్సీ మహిళలకు ఉపశమనం కలుగనుంది.
ఆకాశాన్నంటిన ధర
కోడిగుడ్డు ధర బహిరంగ మార్కెట్‌లో ఆకాశాన్ని అంటుతోంది. మధ్యాహ్న భోజన తయారీ ఏజెన్సీలకు భారంగా మారుతోంది. మంచిర్యాల జిల్లాలోని 747 పాఠశాలల్లో 37,241మంది విద్యార్థులు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని 732 ప్రభుత్వ పాఠశాలల్లో 43,110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో నిధులు విడుదల చేస్తాయి. తొమ్మిది, పది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు వండి పెట్టేందు కు రూ.6.19, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రూ.9.29 స్లాబ్ ధరలతోపాటు కోడిగుడ్డుకు అదనంగా రూ.5 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 9, 10వ తరగతుల వరకు రూ.10.68 పైసలు బిల్లులో కోడిగుడ్డు ధర కలిపి ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరా చేస్తోంది. కూరల కోసం పప్పు, కూరగాయలు, నూనెను వంట ఏజెన్సీ మహిళలు సమకూర్చుకుంటారు. విద్యార్థులందరికీ సోమ, బుధ, శుక్రవారాల్లో మధ్యాహ్న భోజనంలో ఉడికించిన కోడిగుడ్డు అందించాలి. గతంలో గుడ్డుకు రూ.4 చెల్లించే ప్రభుత్వం 2022లో అప్పటి ధరల ప్రకారం రూ.5కు పెంచింది. కానీ కొద్ది నెలలుగా గుడ్డు ధర అమాంతం పెరగడంతో చాలా పాఠశాలల్లో వారానికి ఒకటి, రెండుసార్లు మాత్రమే వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థులు పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఒక్కో గుడ్డుకు రూ.5 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. ప్రస్తుత మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7వరకు పలుకుతున్న సందర్భాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇంకెంత పెరుగుతుందోనని ఏజెన్సీ నిర్వాహకులు ధరలు పెంచాలని ఆందోళన చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం వంట ధరలను పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన ధరలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి తెచ్చారు. కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత మధ్యాహ్నం భోజనం వంట ధరల పెంపుతో ఏజెన్సీలకు కాస్త ఊరట కలిగిస్తోంది.
మూడు రోజులు అందించాలి
కోడిగుడ్డు ధరలు పెంచుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మార్కెట్‌లో గుడ్డు ధరలు పెరగడం వల్ల ఏజెన్సీల నిర్వాహకులు కొంత ఇబ్బంది పడిన విషయం తెలియంది కాదు. రూపాయి పెంచడం వల్ల ఏజెన్సీలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. పోషకాలు అందించేందుకు విద్యార్థులకు విధిగా వారానికి మూడు రోజులు ఉడకబెట్టిన గుడ్డు అందించాల్సిందే.
– యాదయ్య, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment