పట్టుదలతో చదివి.. కొలువులు సాధించి
● నాలుగు ఉద్యోగాలు సాధించిన యువకుడు ● ఆదర్శంగా నిలుస్తున్న సాయిరాంగౌడ్
కౌటాల: ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు ఆ పేదింటి యువకుడు.. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని భావించాడు కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల సాయిరాంగౌడ్. ఇప్పటి వరకు నాలుగు ఉద్యోగాలు సాధించి ఔరా అని పించాడు. మండల రాజేశంగౌడ్– తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. తల్లి గృహిణి కాగా తండ్రి వృత్తిరీత్యా గీత కార్మికుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి భవిష్యత్‌లో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో తొలి ప్రయత్నంలోనే గ్రామ పంచాయతీ కార్యదర్శిగా కొలువు సాధించి ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న క్రమంలో గతేడాది గ్రూప్–4 ప్రకటన వెలువడగా అందులో ఉత్తీర్ణత సాధించి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించాడు. ఈ నెల 11న వెలువడిన గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191వ ర్యాంకు సాధించాడు. శుక్రవారం ప్రకటించిన గ్రూప్–3 ఫలితాల్లో సైతం రాష్ట్రస్థాయిలో 349 ర్యాంక్‌ను సాధించాడు. గ్రూప్–1 మెయిన్స్‌లో 436 మార్కులు సాధించానని, సివిల్స్ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నాడు. సాయిరాంగౌడ్‌ను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment