మార్చిలోనే.. మంటలు
కౌటాల: జిల్లాలో సూరీడు సుర్రుమంటున్నాడు. నాలుగు రోజులుగా నిప్పులు కక్కుతున్నాడు. అధికారిక రికార్డుల ప్రకారం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడగాలులతో సామాన్య ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే జనం చెమటతో తడిసిపోతున్నారు. అధిక వేడికి తోడు వడగాలులు వీస్తుండడంతో జనం ఇళ్లలోనే ఉడికిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగడం గమనించాల్సిన అంశం. పెరిగిన ఉష్ణోగ్రతలతో పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
‘సన్’ డే..
జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ఉదయం 10 దాటితే ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి ఏడుగంటల వరకు తగ్గడం లేదు. గంట గంటకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉపాధి హామి పనులు కూడా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో వేసవి వేడిమి పెరగడం నిత్య శ్రమజీవులకు గుదిబండగా మారింది. మధ్యాహ్నం వేళ అంతా కార్యాలయాలు, ఇళ్లకే పరిమితం అవుతుండడంతో రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఆదివారం రెబ్బెనలో 41.8, తిర్యాణిలో 41.7, ఆసిఫాబాద్‌లో 41.6, కెరమెరిలో 41.5, కౌటాల, కెరమెరి, సిర్పూర్(టి)లో 41.3, కాగజ్‌నగర్‌లో 40.8, వాంకిడిలో 40.5, పెంచికల్‌పేట్‌లో 40.4, చింతలమానెపల్లిలో 40.2, బెజ్జూర్‌లో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిర్పూర్(యు), లింగాపూర్, దహెగాం మండలాలు పరిశీలన జోన్‌లో ఉండగా మిగతా 12 మండలాలు అలెర్ట్ జోన్‌లో ఉన్నాయి.
మరింత మంటలే..!
అడవుల జిల్లాగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్‌లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావ డం కలవరపరుస్తోంది. గతేడాదితో పోల్చితే వేసవి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మార్చి రెండో వారంలోనే ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ విభాగం ముందే చెప్పినట్లు ఈ వేసవి నిప్పుల కొలిమిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్ల ఈ పరిస్థితి కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు పాటించాలి
ప్రజలు వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఉదయం 11 నుంచి మూడు గంటల మధ్య కిరణాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధి హామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇంటికి వెళ్లాలి. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీరు తాగాలి. ఎండకు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
– డాక్టర్ నవత, మెడికల్ ఆఫీసర్, కౌటాల
నిర్మానుష్యంగా కౌటాల–తలోడి రోడ్డు
నాలుగు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ ప్రాంతం ఉష్ణోగ్రతలు
13న రెబ్బెన 40.8
14న గిన్నెధరి 40.4
15న ఆసిఫాబాద్ 42.4
16న రెబ్బెన 41.8
నాలుగు రోజులుగా సుర్రుమంటున్న సూరీడు
వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
రెబ్బెనలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
మార్చిలోనే.. మంటలు
Comments
Please login to add a commentAdd a comment